YS Sharmila: ఈ జన్మకు మారరు.. పచ్చకామెర్ల రోగం ఇంకా తగ్గలేదా..? జగన్‌పై షర్మిల ఫైర్
ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు.
- By News Desk Published Date - 10:59 PM, Mon - 7 April 25

YS Sharmila: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెర్ల రోగం తగ్గినట్లు లేదు. కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా సీఎం చంద్రబాబు నాయుడు కనిపించడం చాలా బాధాకరం అంటూ జగన్ ను, వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ షర్మిల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
షర్మిల ట్వీట్ ప్రకారం.. ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం. స్వయంశక్తితో ఎదుగుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనం. 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. మీ నీచపు చేష్టలు మారలేదు. అసత్యాలు వల్లెవేయడం మానుకోలేదు. నిజాలు జీర్ణించుకోలేని మీరు..ఇక ఈ జన్మకు మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థం అయింది అంటూ షర్మిల విమర్శించారు.
ఎవరికి ఎవరు దత్తపుత్రుడో తెలుసు..
ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి.. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. ప్యాలెస్ లు కట్టుకున్నారు. సొంత ఖజానాలు నింపుకున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారు. రిషికొండను కబ్జా చేయాలని చూశారు. మొత్తంగా మోడీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోడీకి మద్దతుగా నిలిచి ఐదేళ్లపాటు మోదాని సేవలో తరించినట్లు ప్రజలకు సర్వం బోధపడింది అంటూ వైసీపీపై షర్మిల విమర్శలు చేశారు.
ఏపీలో బీజేపీ అంటే..?
ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన ఖర్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డికి పట్టలేదు. పులి బిడ్డ పులిబిడ్డే. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవే. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుంది. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ములేకుంటే.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను బయట ఉండి ఎత్తిచూపుతూ.. ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నది ఈ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే.
మా ఆవేదన కనపడకపోవడం..
వక్ఫ్ బిల్లుకి మద్దతు పలికి ముస్లింలకు ఇఫ్తార్ విందులో బాబు విషం పెట్టారని చేసిన మా ఆరోపణలు వినపడకపోవడం మీరు చెవిటోళ్లు అనడానికి.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మా ఆవేదన కనపడకపోవడం మీరు గుడ్డోళ్ళు అనడానికి నిదర్శనం. మీకు ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి పోలవరం మీద ఎందుకు ప్రశ్నించలేదు.. ? అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ మోసాలను ఎందుకు ఎండగట్టలేదు..? మీ నీచపు కుయుక్తులతో, పాపపు సొమ్మును ఎరగా చూపి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలనే కుట్ర తప్ప.. ప్రజా సమస్యలపై మీకు ఏమాత్రం శ్రద్ధ లేదు. కాంగ్రెస్ ఎదగడం చూసి మీరు భయపడుతున్నారు అనేది పచ్చి నిజం అంటూ వైసీపీపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.