YS Jagan: పప్పూ నిద్ర వదులు.. మంత్రి లోకేష్‌పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాయగా.. 31,922 మంది ఉత్తీర్ణులయ్యారు.
- By Gopichand Published Date - 09:44 AM, Mon - 30 June 25

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థలో చోటు చేసుకున్న గందరగోళానికి ఏపీ ఈసెట్ (AP ECET) అడ్మిషన్ ప్రక్రియ ఆలస్యం ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) ఆరోపించారు. మే 15, 2025న ఈసెట్ ఫలితాలు వెలువడినప్పటికీ.. 45 రోజులు గడిచినా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించకపోవడం, అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితంలో నెట్టివేసిందని ఆయన విమర్శించారు.
ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాయగా.. 31,922 మంది ఉత్తీర్ణులయ్యారు. అయినప్పటికీ ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటినా కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కాకపోవడం విద్యార్థులను నిరాశకు గురిచేస్తోంది. ఇంజినీరింగ్ కళాశాలల్లో జూలై 1, 2025 నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అడ్మిషన్లు ఇంకా పూర్తి కాకపోవడం విద్యార్థుల ఆందోళనను మరింత పెంచుతోంది.
Also Read: Iron Pan: ఈ కూరలు వండాలంటే ఇనుప కడాయి కావాల్సిందే.. రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా!
వైఎస్ జగన్ తన ఎక్స్ పోస్ట్‌లో లోకేష్‌ను ఉద్దేశించి “అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు” అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆయన ఆరోపించారు. ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ సాధారణంగా జూన్ లేదా జూలైలో మొదలవుతుంది. అయితే, ఈ ఏడాది ఆలస్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2025
కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆప్షన్ ఎంట్రీ, సీటు కేటాయింపు వంటి దశలు ఉంటాయి. అర్హత సాధించిన విద్యార్థులు కనీసం 25% మార్కులు (200లో 50 మార్కులు) సాధించాలి. ఈ ఆలస్యం వల్ల విద్యార్థులు తమ కోర్సులు, కళాశాలలు ఎంచుకోవడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. ఇది వారి విద్యా షెడ్యూల్‌ను దెబ్బతీస్తోంది. ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని.. వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించి, అడ్మిషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.