YSRCP Bus Yatra : ఉత్తరాంధ్రపై వైసీపీ ఫోకస్.. 26న బస్సుయాత్ర షురూ
YSRCP Bus Yatra : ఉత్తరాంధ్రపై వైఎస్సార్ సీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
- By Pasha Published Date - 12:37 PM, Sun - 22 October 23

YSRCP Bus Yatra : ఉత్తరాంధ్రపై వైఎస్సార్ సీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 26న శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి బస్సుయాత్రను ఆ పార్టీ ప్రారంభిస్తోంది. ఆదివారం విశాఖపట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈవిషయాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. తమ పార్టీ చేపట్టే బస్సుయాత్రకు.. ‘సామాజిక సాధికారిత బస్సుయాత్ర’ అని పేరు పెట్టామని తెలిపారు. యాత్ర షెడ్యూల్ గురించి వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జగన్ పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాల గురించి ఈ యాత్ర ద్వారా (YSRCP Bus Yatra) వివరిస్తామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తొలిరోజు 26న ఇచ్చాపురంలో బహిరంగ సభ ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈనెల 27న గజపతినగరంలో, 28న భీమిలీలో, 30న పాడేరులో, నవంబర్ 1న పార్వతీపురంలో, నవంబర్ 2న మాడ్గులలో, నవంబర్ 3న పలాసలో, నవంబర్ 4న శృంగవరపుకోటలో, నవంబర్ 6న గాజువాకలో, నవంబర్ 7న ఆముదాలవలసలో, నవంబర్ 8న సాలూరులో, నవంబర్ 9న అనకాపల్లిలో బస్సుయాత్ర కొనసాగుతుందని చెప్పారు. దీపావళి పండుగ తర్వాత రెండో దశ షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపారు. కాగా, త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతానని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన తరుణంలో ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఈ యాత్ర ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.