Ambati Rambabu : ఏపీలో మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా పాలన: అంబటి రాంబాబు
మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నం ఘటనను గుర్తుచేస్తూ, ఈ దాడికి పొన్నూరు ఎమ్మెల్యేకు సంబంధం లేదంటారా? అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. నిందితులను ఎమ్మెల్యే స్వయంగా రక్షించి గ్రామం నుంచి పంపించారు.
- Author : Latha Suma
Date : 04-07-2025 - 7:32 IST
Published By : Hashtagu Telugu Desk
Ambati Rambabu : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా అప్రజాస్వామికంగా మారిందని, ప్రతిరోజూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నం ఘటనను గుర్తుచేస్తూ, ఈ దాడికి పొన్నూరు ఎమ్మెల్యేకు సంబంధం లేదంటారా? అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. నిందితులను ఎమ్మెల్యే స్వయంగా రక్షించి గ్రామం నుంచి పంపించారు. ఇది చాలా తీవ్ర విషయమైందని మేము చెబుతున్నాం. పోలీసు వ్యవస్థ పూర్తిగా మౌనంగా మారింది. దాడులు జరుగుతుండగా అధికారులు చూస్తూ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని మండిపడ్డారు.
Read Also: Mallikarjun Kharge : ఆపరేషన్ సిందూర్‌కు పూర్తి మద్దతిస్తే..మోడీ యుద్ధాన్ని ఆపారు : మల్లికార్జున ఖర్గే
రెడ్‌బుక్ ను కొనసాగించేందుకు కొందరు రిటైర్డ్ అధికారులు, ప్రస్తుత ప్రభుత్వ అధికారులతో కలిసి అజ్ఞాతంగా కుట్రలు సాగిస్తున్నారని ఆరోపించారు. పల్నాడులో గుండ్లపాడు గ్రామంలో టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరి ప్రాణాలు పోయినప్పటికీ, కేసులు మాత్రం వైఎస్సార్‌సీపీ నేతలపైనే పెట్టారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. SP మొదట ఒక మాట చెబుతారు. తర్వాత అదే SP మాట మార్చి మాపార్టీ వారినే నిందితులంటున్నారు. ఇది ఏ విధమైన న్యాయమా? అని నిలదీశారు. ఇక సింగయ్య కేసులోనూ తప్పుడు ప్రకటనలపై ఘాటు విమర్శలు చేశారు. మొదట అతన్ని ప్రయివేటు కారు ఢీకొట్టిందని SP చెప్పారు. తర్వాత జగన్ గారు ప్రయాణించిన కారే ఢీకొట్టిందని చెప్పి కేసు పెట్టారు.
ఆసుపత్రికి తరలించేందుకు 40 నిమిషాల ఆలస్యం ఎందుకు జరిగింది? అంబులెన్స్‌లో ఎక్కే సమయంలో చక్కగా మాట్లాడిన సింగయ్య ఆ తర్వాత ఎలా మరణించారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా రాజకీయ అవసరాలకు వాడుకుంటూ టీడీపీ, జనసేన కూటమి పని చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి తూట్లూరుతో సమానమని తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబుకు అసలు బుద్ధి, జ్ఞానం ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. అజ్ఞాత బృందాలతో ఎంత దారుణాలు చేయిస్తున్నారో మాకు తెలుసు. మా కార్యకర్తలపై కుట్రలు పన్నే వారెవరో గుర్తించాం. తగిన సమయానికి వారందరికీ గుణపాఠం చెబుతాం. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని హెచ్చరించారు అంబటి రాంబాబు.