CM Jagan: జగన్ ఢిల్లీ టూర్.. ప్రధానితో చర్చించనున్న కీలక అంశాలు ఇవే..!
- By HashtagU Desk Published Date - 04:28 PM, Mon - 4 April 22

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్ర 4 గంటల 30 నిముషాలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. సీఎం జగన్‌కు పీఎంవో వర్గాలు అపాయింట్మెంట్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో సీఎం జగన్, ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉందని సమాచారం.
ఈ భేటీలో భాగంగా ముఖ్యంగా కొత్త జిల్లాల అంశం అంటే ముఖ్యంగా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ నేపధ్యంలో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి, ఏప్రిల్ 4 నుంచి ఆ జిల్లాల్లో పాలన కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో తాజా భేటీలో జగన్ ఈ అంశం పై ప్రధాని మోడీకి వివరించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరితగతిన విడుదల చేయాల్సిందిగా కోరే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక ఆంధ్ర జీవనాడి పోలవరం విషయంలో, అలాగే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపైనా మోదీతో జగన్ మాట్లాడనున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కనీసం అప్పుల రూపంలో అయినా నిధులు ఇప్పించేలా సహకరించాలని ఈ భేటీలో భాగంగా సీఎం జగన్ ప్రధాని మోదీని కోరే అవకాశం ఉంది. అలాగే విభజన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మరోసారి ప్రధాని మోదీని జగన్ కోరనున్నారని సమాచారం. ఇకపోతే ప్రధాని మోదీతో భేటీ అనంతరం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం.