Relieves AP Cadre IAS Officers: తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఏపీ ఐఏఎస్‌లు.. జీహెచ్ఎంసీకి కొత్త కమిషనర్!
రిలీవ్ అయిన ఐఏఎస్‌ల స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలోనే టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్. శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
- Author : Gopichand
Date : 17-10-2024 - 12:16 IST
Published By : Hashtagu Telugu Desk
Relieves AP Cadre IAS Officers: తెలంగాణ నుంచి నలుగురు ఏఏఎస్‌లు రిలీవ్ (Relieves AP Cadre IAS Officers) అయ్యారు. రిలీవ్ అయినవారిలో ఐఏఎస్‌లు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్‌లు ఉన్నారు. అంతేకాకుండా ఏపీ నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్‌లు శివ శంకర్, సృజన, హరికిరణ్.. తెలంగాణ CS శాంతికుమారిని కలిశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వారి విధులను వేరే వారికి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జెన్ కో & ట్రాన్స్ కో ఎండీగా రోనాల్డ్ రాస్ బాధ్యతలు నిర్వర్తించగా.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి పని చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్‌లు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంది.
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి
రిలీవ్ అయిన ఐఏఎస్‌ల స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలోనే టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్. శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, మహిళ సంక్షేమ శాఖ కార్యదర్శిగా టి.కె.శ్రీదేవి.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తిలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో ఆమ్రపాలికి కీలక బాధ్యతలు?
ఐఏఎస్‌ల వ్యవహారంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. డీఓపీటీ ఆదేశాలపై క్యాట్‌కు వెళ్లినా అధికారులకు రిలీఫ్ దక్కలేదు. క్యాట్ ఆదేశాలతో ముందుగా కేటాయించిన రాష్ట్రాల్లో అధికారులు రిపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఏపీలో ఆమ్రపాలికి కీలక బాధ్యతలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని కార్యాలయంలోనూ పని చేసి ఉండటం ఇప్పుడు ఆమెకు కలిసొచ్చే అంశంగా తెలుస్తోంది. ఐఏఎస్ ఆమ్రపాలి తన స్వస్థలం విశాఖపట్నం అని పేర్కొనడంతో ఆమెను ఏపీకి రిపోర్ట్ చేయాల్సిందిగా హైకోర్టు సైతం ఆదేశించిన విషయం తెలిసిందే.