Amaravathi: అమరావతిపై వైసీపీ ట్విస్ట్, `పేదల`పై పాలి`టిక్స్`!
ఏపీ రాజధాని అమరావతి వివాదం మళ్లీ రాజుకుంది.
- Author : CS Rao
Date : 08-09-2022 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ రాజధాని అమరావతి వివాదం మళ్లీ రాజుకుంది. సామాజికవర్గానికి ముడిపెడుతూ ఇంతకాలం నడిపిన డ్రామా పేదల వైపు మళ్లింది. రాజకీయ కోణం నుంచి అమరావతిని తీసుకెళ్లడంలోఎప్పటికప్పుడు వైసీపీ గందరగోళాన్ని సృష్టిస్తోంది. తాజాగా రాజధాని ప్రాంతంలో పేదలు ఎవరికైనా ఇళ్ల స్థలాలను ఇచ్చే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఆ మేరకు క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేయడంతో కొత్త వివాదం బయలు దేరింది.
సీఆర్డీయే ఒప్పందాల ప్రకారం అమరావతి రాజధాని కోసం ప్రత్యేక డిజైన్ ఉంది. ఆ మేరకు సింగపూర్ కన్సార్టియంతో ఎంఓయూ కూడా చేసుకుంది. ఆ ప్రకారం అక్కడ నిర్మాణాలు ఉంటాయని రైతులకు సీఆర్డీయే హామీ ఇచ్చింది. కానీ, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత పూర్వపు ఒప్పందాలు, హామీలు గాలికిపోయాయి. దీంతో రాజధాని నిర్మాణం నిలిచిపోయింది. అంతేకాదు, రైతులు ఇచ్చిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్ సర్కార్ జీవోలను విడుదల చేసింది. వాటిని బేస్ చేసుకుని రైతులు న్యాయపోరాటం చేశారు. చివరకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ప్రభుత్వం అంగీకరించింది. కానీ, తాజాగా క్యాబినెట్ సమావేశంలో సీఆర్డీయే బిల్లులో సవరణలు తీసుకురావడం గమనార్హం.
Also Read: AP Politics: కృష్ణా జిల్లా రాజకీయంపై చంద్రబాబు ఫోకస్
సీఆర్డీయే నిబంధనల ప్రకారం పేదలకు రాజధాని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి లేదు. అందుకే, ఆ నిబంధనలను మార్చుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలు అయినప్పటికీ అమరావతిలో ఇళ్ల స్థలాలకు అర్హత పొందేలా సవరణలు చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని గతంలో రైతులు న్యాయస్థానాల్లో సవాల్ చేశారు. దీంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఇప్పుడు సీఆర్డీయే బిల్లు సవరణలతో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్ సర్కార్ సిద్ధం అయింది. సరిగ్గా, ఇక్కడే రాజకీయ కోణాన్ని వైసీపీ బయటకు తీసింది.
Also Read: YS Jagan Vs Employees: జగన్ దెబ్బకు ఉద్యోగుల విలవిల!
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దు అంటే, అమరావతి వద్దు అనే నినాదాన్ని వైసీపీ తీసుకుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి లేదని ప్రత్యర్థి పార్టీలు పోరాటం చేయడానికి వీల్లేకుండా ప్లాన్ చేసింది. మొత్తం మీద రాజకీయ చట్రంలో అమరావతి మరోసారి నలుగుతోంది. దీనికి ఎలాంటి పరిష్కారం వస్తుందో చూడాలి.