AP Politics: కృష్ణా జిల్లా రాజకీయంపై చంద్రబాబు ఫోకస్
ఏపీ రాష్ట్రంలో కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. అక్కడ పరస్పరం ఎవరికి పొసగదు.
- Author : CS Rao
Date : 08-09-2022 - 4:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ రాష్ట్రంలో కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. అక్కడ పరస్పరం ఎవరికి పొసగదు. పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడే లీడర్లు ఎక్కువగా ఉంటారు. అందుకే, తెలుగు మహిళల్ని చూసి నేర్చుకోండంటూ చంద్రబాబు ఆగ్రహించారు. గుడివాడ కేంద్రంగా మినీమహానాడు పెట్టడానికి కూడా సమన్వయం లేకపోవడాన్ని ప్రశ్నించారు. అక్కడి ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిని ముట్టడించడానికి వెళ్లిన మహిళలకు ఉన్న పోరాటపటిమ జిల్లాలోని లీడర్లకు లేదని అసహనం వ్యక్తం చేయడం టీడీపీలో చర్చనీయాంశం అయింది.
మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీని వైసీపీ కార్యకర్తలు దాడిచేసిన సంఘటనపై కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ మంత్రి దేవినేని ఉమ, బోండా ఉమ, ఎంపీ కేశినేని నాని హాజరు కాలేదు. ఇతర దేశాల్లో బొండా, దేవినేని ఉన్నారు. ఢిల్లీలో ఉన్న కేశినేని సమావేశానికి రాలేదు. సహచర లీడర్ కన్నుపొడిచేసినప్పటికీ ఐక్యంగా పోరాడాలన్న బాధ్యత కూడా లేకుండా పార్టీలో ఉన్నారని చురకలేశారు. ఇలా అయితే, పార్టీలో ఉండనవసరం లేదని ఘాటుగా చంద్రబాబు చెప్పారట.
Also Read: Amaravathi : అమరావతిపై వైసీపీ ట్విస్ట్, `పేదల`పై పాలి`టిక్స్`!
కృష్ణా జిల్లా కేంద్రంగా దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్, కేశినేని చాలా కాలంగా రాజకీయం చేస్తున్నారు. 2014 తరువాత బొండా ఉమ ప్రముఖంగా తెరమీదకు వచ్చారు. ఆయనతో పాటు ఇప్పుడు తాజాగా బుద్ధా వెంకన్న కనిపిస్తున్నారు. వాళ్ల మధ్య ఎక్కడా రాజకీయం పొసగదు. ఫలితంగా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ చతికిలపడింది. పార్టీకి అంటీముట్టనట్టు ఎంపీ కేశినేని నాని ఉంటారు. అప్పడప్పుడు అధిష్టానం మీద ట్విట్టర్ వేదికగా రంకెలు వేస్తుంటారు. ఇక గద్దె రామ్మోహన్ మధ్యే మార్గంగా కర్రవిరగకుండా పాము చావకుండా అన్నట్టు వ్యవహరిస్తారు. పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్న వర్ల రామయ్య ను పార్టీలోని కొందరు వైట్ ఎలిఫెంట్ గా చెప్పుకుంటారు. ఎవరూ క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధంగా లేరని చంద్రబాబు గ్రహించారని సమాచారం. అందుకే, ఇలా అయితే కుదరదంటూ కఠినంగా హెచ్చరించారని తెలుస్తోంది.
Also Read: Jagananna Sports Club APP : జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా
కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గ్రూపు విభేదాలు ఉన్నాయి. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో నాయకత్వ లోపం క్లియర్ గా ఉందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే, స్వయంగా తానే కృష్ణా జిల్లా రాజకీయాన్ని చూసుకుంటానని సమావేశంలోనే చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. చెన్నుపాటి గాంధీ పై దాడి జరిగిన సంఘటనపై తగిన విధంగా స్పందించకపోవడాన్ని చాలా సీరియస్ గా చంద్రబాబు తీసుకున్నారు. ఇక నుంచి కృష్ణా రాజకీయాన్ని పూర్తిగా ఆయనే చూడ్డానికి సిద్దమయ్యారు. అంటే, ఏ స్థాయిలో కృష్ణా జిల్లా టీడీపీ నేతలు పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.