Police Power War: కడప వన్ టౌన్‌లో పోలీస్ పవర్ వార్.. సీఐ వర్సెస్ ఎస్పీ!
ఇదే కేసులో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజా అరెస్టు కూడా వివాదాస్పదమైంది. శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా పోస్టుల కేసులో అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.
- By Gopichand Published Date - 07:48 PM, Thu - 2 October 25

Police Power War: కడప జిల్లా పోలీస్ శాఖలో గత 24 గంటల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జిల్లా పోలీస్ ఉన్నతాధికారి (ఎస్పీ) పంపిన వీఆర్ ఆదేశాలను దిక్కరించి వన్ టౌన్ సీఐ రామకృష్ణ తిరిగి విధుల్లో చేరడం జిల్లా పోలీస్ వర్గాల్లో (Police Power War) సంచలనం సృష్టించింది. ఒక సీఐ ఎస్పీ ఆదేశాలను అతిక్రమించి తిరిగి విధుల్లో చేరడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
మాజీ డిప్యూటీ సీఎం కేసులో వివాదం
సీఐ రామకృష్ణను వీఆర్‌కు పంపడం వెనుక మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై కేసు నమోదు వ్యవహారమే ప్రధాన కారణంగా ఉన్నట్లు జిల్లా పోలీస్ శాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఎమ్మెల్యే మాధవీ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారానికి సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై కేసు నమోదైంది. ఈ కేసు నమోదు విషయంలో సీఐ రామకృష్ణ నిబంధనలను అతిక్రమించారని ఆరోపిస్తూ ఎస్పీ ఆయనను వీఆర్‌కు పంపినట్లు సమాచారం. అయితే ఈ ఆదేశాలు వచ్చిన 24 గంటలు కూడా గడవకముందే సీఐ రామకృష్ణ తిరిగి వన్ టౌన్ స్టేషన్‌లో విధుల్లో చేరడం గమనార్హం. దీనితో ఎస్పీపై సీఐ తన పంతం నెగ్గించుకున్నారనే చర్చ నడుస్తోంది.
Also Read: IT Industry Performamce: షాకింగ్ రిపోర్ట్.. మందగిస్తున్న భారత ఐటీ రంగం!
అంజాద్ బాషా పీఏ ఖాజా అరెస్ట్, విడుదల
ఇదే కేసులో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజా అరెస్టు కూడా వివాదాస్పదమైంది. శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా పోస్టుల కేసులో అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న (బుధవారం) హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయన్ను కడపకు తీసుకువచ్చారు. అరెస్టు అనంతరం ఖాజాను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఒక పోస్టును షేర్ చేసినందుకు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతారా అంటూ కోర్టు ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో పాటు 41ఏ నోటీసులు ఇచ్చి తక్షణమే విడుదల చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.