Minister Lokesh: ఎంఓయూపై సంతకం చేశాక పూర్తి బాధ్యత మాదే: మంత్రి లోకేష్
అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సింగపూర్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుందని లోకేష్ తెలిపారు.
- By Gopichand Published Date - 07:09 PM, Mon - 28 July 25

Minister Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు పూర్తి మద్దతు అందిస్తామని, ఎంఓయూపై సంతకం చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తి బాధ్యత తమదేనని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్- సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్, సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి మాస్టర్ ప్లాన్, సింగపూర్ సహకారం
అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సింగపూర్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుందని లోకేష్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు సింగపూర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అమరావతి మాస్టర్ ప్లాన్‌ను అందించిందని గుర్తు చేశారు.
పెట్టుబడులకు అపార అవకాశాలు
974 కి.మీ.ల సువిశాల తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, ఫిన్‌టెక్, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని లోకేష్ నొక్కి చెప్పారు. తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా, ఆదిత్య మిట్టల్తో ఒక్క జూమ్ కాల్ సంభాషణతోనే భారతదేశంలోనే అతిపెద్దదైన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి అంగీకరించారని ఉదాహరణగా చెప్పారు. అలాగే, రెన్యూ పవర్ సంస్థ ఇండియాలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్‌కు అనంతపురం జిల్లాలో పనులు ప్రారంభించిందని తెలిపారు.
Also Read: Cryptocurrency: దేశంలో క్రిప్టోకరెన్సీ వాడకం, నియంత్రణపై కేంద్రం చర్యలు
ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, మద్దతు
ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ఇటీవల ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0తో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మారబోతోందని లోకేష్ వివరించారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు అవసరమైన మ్యాన్‌పవర్, వర్క్ ఫోర్స్ తమ వద్ద సిద్ధంగా ఉందని, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు అవసరమైన ఆర్ అండ్ డీ, ప్లగ్ అండ్ ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, సౌకర్యాలు, ప్రోత్సాహకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వంలో పనిచేస్తున్న శాసనసభ్యుల్లో 50 శాతం, మంత్రివర్గంలో 75 శాతం కొత్తవారని, సింగపూర్ నుంచి ఏపీలో పరిశ్రమల స్థాపనకు వచ్చే ఇన్వెస్టర్లకు అవసరమైన పూర్తిస్థాయి మద్దతు తమ నుంచి లభిస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్, ఇంపాక్ట్ సహకారాన్ని తాము సింగపూర్ నుంచి కోరుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు.