Minister Lokesh : ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది: మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు కలుసుకుని రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను చర్చించారు. TCS, IBM, L&T వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే సహకారానికి ముందుకు రావడం గమనార్హం.
- By Latha Suma Published Date - 03:48 PM, Tue - 8 July 25

Minister Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలిసారిగా సిలికాన్ వ్యాలీ తరహాలో ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. మరో ఆరు నెలల్లో ఈ విప్లవాత్మక ప్రాజెక్టు ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశారు. ఇది రాష్ట్ర ఐటీ రంగానికి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. బెంగళూరులోని మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో నిర్వహించిన రోడ్ షోలో లోకేశ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు కలుసుకుని రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను చర్చించారు. TCS, IBM, L&T వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే సహకారానికి ముందుకు రావడం గమనార్హం.
Read Also: Odisha : గర్భిణికి పురిటి కష్టాలు..10 కిలోమీటర్లు డోలీలో మోసి ఆసుపత్రికి తరలించిన గ్రామస్థులు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. పెట్టుబడుల కోసం ఇది అత్యుత్తమ సమయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి మార్గంలో సాగుతోంది. నూతన సాంకేతిక రంగాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో ఏపీ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది అని వివరించారు. అమరావతిలో నెలకొనబోయే క్వాంటమ్ వ్యాలీ ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇది కేవలం రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశానికే టెక్నాలజీ విప్లవానికి నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు.
వైశాఖపట్నం మహానగరాన్ని ఐటీ, స్టార్టప్ రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పలు కంపెనీలు విశాఖలో తమ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచినట్టు మంత్రి తెలిపారు. మేం పెట్టుబడుదారుల కోసం స్పష్టమైన విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతులు అందిస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా ప్రోత్సాహక ప్యాకేజీలు అందిస్తున్నాం. ఇది ఒక్క అభివృద్ధి మాత్రమే కాదు, ఉద్యోగ అవకాశాలకూ గొప్ప వేదికగా మారబోతోంది అని లోకేశ్ వివరించారు. క్వాంటమ్ వ్యాలీతోపాటు, రాష్ట్రంలో గ్లోబల్ సంస్థలతో భాగస్వామ్యంలో కేంద్రాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో, స్థానిక యువతకు అత్యాధునిక రంగాల్లో ఉద్యోగాలు, శిక్షణ అవకాశాలు ఏర్పడనున్నాయి. దీని ద్వారా భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమైన నైపుణ్య శక్తి ఏపీలో అభివృద్ధి చేయవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Nepal : శ్రీరామ జన్మస్థలంపై మళ్లీ వివాదం.. నేపాల్ ప్రధాని ఓలి సంచలన వ్యాఖ్యలు