Nepal : శ్రీరామ జన్మస్థలంపై మళ్లీ వివాదం.. నేపాల్ ప్రధాని ఓలి సంచలన వ్యాఖ్యలు
.శ్రీరాముడు నేపాల్ భూభాగంలోనే జన్మించాడని చెప్పారు. వాల్మీకి రచించిన అసలైన రామాయణం ఆధారంగా తాను మాట్లాడుతున్నానని వెల్లడించారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. వాల్మీకి మహర్షి రాసిన గ్రంథంలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి అని ఓలి పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 03:12 PM, Tue - 8 July 25

Nepal : శ్రీరాముడి జన్మస్థల విషయంలో మరోసారి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతానికి అత్యంత పవిత్రమైన అయోధ్య భారతదేశంలోనే ఉందన్న విస్తృత విశ్వాసానికి విరుద్ధంగా, రాముడు నేపాల్‌లో జన్మించాడని ఓలి స్పష్టం చేశారు. సోమవారం (జూలై 7) న కాఠ్‌మాండులో జరిగిన కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓలి మాట్లాడుతూ..శ్రీరాముడు నేపాల్ భూభాగంలోనే జన్మించాడని చెప్పారు. వాల్మీకి రచించిన అసలైన రామాయణం ఆధారంగా తాను మాట్లాడుతున్నానని వెల్లడించారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. వాల్మీకి మహర్షి రాసిన గ్రంథంలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి అని ఓలి పేర్కొన్నారు.
Read Also: Nepal Floods : నేపాల్-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు.. వందలాది వాహనాలు, పోలీసులు గల్లంతు
రాముడి పుట్టిన స్థలం నేపాల్‌లోనే ఉందని, అది చరిత్రలోనూ, పురాణాల్లోనూ పేర్కొనబడినదేనని ఆయన వివరించారు. ఇప్పటికీ ఆ ప్రాంతం మేమందరికీ తెలుసు. కానీ మేము ప్రపంచానికి ఇది బలంగా తెలియజేయడంలో వెనుకబడ్డాం అని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల కొంతమంది అసహనంగా ఫీలవుతున్నారని, కానీ ఇది చారిత్రకంగా, మతపరంగా నిజమని చెప్పారు. రాముడి జన్మస్థలాన్ని గురించి మానవులు అనేక కథలను నిర్మించడం ఎలా సాధ్యమవుతుంది? వాస్తవాన్ని దాచలేం. ప్రజలు ధైర్యంగా దీన్ని ప్రచారం చేయాలి అని ఓలి పిలుపునిచ్చారు.
కేవలం రాముడే కాదు, శివుడు మరియు విశ్వామిత్రుడు కూడా నేపాల్ భూభాగంలోనే జన్మించారని ఓలి పేర్కొన్నారు. ఇది తాను తయారుచేసుకున్న కథ కాదు, వాల్మీకి రచనలో ఇదంతా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇది నేపాల్ పౌరుల గర్వకారణం కావాలి. మతపరమైన భావోద్వేగాలకు భయపడకుండా సత్యాన్ని సమాజంలో ప్రచారం చేయాలి అని ఓలి వాఖ్యానించారు. ఇదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు ఓలి గతంలోనూ చేశారు. 2020లో అయోధ్య భారతదేశంలో కాదని, నేపాల్‌లోని చిత్వాన్ జిల్లాలోని థోరిలో ఉందని ఓలీ ప్రకటించారు. ఇక్కడే రాముడు జన్మించాడని, అలాగే దశరథుడు ‘పుత్రకామేష్ఠి యాగం’ చేసిన ప్రదేశం కూడా అదే ప్రాంతమని చెప్పారు. ఆ సమయంలో కూడా ఓలీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
ఈ వ్యాఖ్యలపై భారత్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత నేపాల్ విదేశాంగ శాఖ స్పందించింది. ఓలీ వ్యాఖ్యలు ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి చేయలేదని, రామాయణం ఒక విశాలమైన సాంస్కృతిక, భౌగోళిక పునాది కలిగిన ఇతిహాసమని, దీనిపై విస్తృత అధ్యయనం అవసరమని తెలిపింది. ఓలి వ్యాఖ్యలు రెండు దేశాల మధ్యం మతపరమైన భావోద్వేగాలను తాకుతున్నాయి. ఇలాంటి ప్రకటనలు భారత-నేపాల్ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మత విశ్వాసాలు సున్నితమైనవి కావటంతో, నాయకులు మాట్లాడే పదాల్లో బాధ్యత ఉండాల్సిన అవసరం మరింతగా ఉన్నది.
Read Also: Pawan Kalyan : నల్లపరెడ్డి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం