New political Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. ఆరోజే పార్టీ పేరు ప్రకటన .. టార్గెట్ ఎవరంటే?
ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రముఖ వ్యాపార వేత్త రామచంద్ర యాదవ్ జులై 23న పార్టీ పేరును ప్రకటించనున్నారు.
- By News Desk Published Date - 10:03 PM, Mon - 19 June 23

ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ (YCP) తో పాటు, టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ముఖ్యంగా అధికార వైసీపీపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీ నేతలుసైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుండటంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) నూతన రాజకీయ పార్టీ (New political Party) స్థాపించనున్నారు. జులై 23న పేరును ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
నాగార్జున యూనివర్శిటీ ముందు ఉన్న స్థలంలో జులై 23న ప్రజా సింహగర్జన సభ పేరిట పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో మార్పు అవసరమని, తమ కొత్త పార్టీ ఏపీలో నవశకాన్ని తీసుకురానుందని వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ చెప్పారు. అయితే, పార్టీ పెట్టకముందే ఆయన రాజకీయ ప్రత్యర్థి ఎవరోకూడా చెప్పేశారు. అధికార వైసీపీ పార్టీనే తన రాజకీయ ప్రత్యర్థి అని, ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. ఏపీలో దోపిడీ పాలన నడుస్తోందని, ఒక ఫ్యాక్షన్ నాయకుడు అధికారంలోకి రావడం దురదృష్టకరమని అన్నారు. వైసీపీ గద్దెనెక్కాక ఒక్క సాగునీటి ప్రాజెక్టుల్లోనే రూ.30వేల కోట్ల దోపిడీ జరిగిందని రామచంద్ర యాదవ్ ఆరోపించారు.
ప్రస్తుతం ఏపీలో వైసీపీ, టీడీపీలు బలమైన పార్టీగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం ఉంది. బీజేపీ సైతం ఏపీలో పుంజుకుంటుంది. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టిసారించి. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకూడా బలమైన పార్టీగా అవతరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రామచంద్ర యాదవ్ ఏర్పాటు చేయబోయే నూతన పార్టీని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.