MLA Muthireddy : ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాకిచ్చిన కూతురు.. మీడియా ఎదుటే నిలదీత.. అసలేం జరిగిందంటే?
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చేర్యాలలో 1200 గజాలు, జనగామలో 1100 గజాలు కొనిచ్చారని నా కూతురు తుల్జా భవానీ అంటోంది. నా కూతురికి నేను సంపాదించిన ఆస్తి ఇస్తే ఎలా మోసం అవుతుంది అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
- By News Desk Published Date - 09:28 PM, Mon - 19 June 23

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) కి ఆయన కుతురు తుల్జా భవాని రెడ్డి (Tulja Bhavani Reddy) షాకిచ్చింది. ముత్తిరెడ్డి సోమవారం వడ్లకొండ గ్రామంలో హరితోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన తుల్జా భవాని తండ్రిని మీడియా ముందే నిలదీసింది. కూతురు తండ్రిని నిలదీస్తుండడంతో అక్కడే ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తుపోయారు. నాకు తెలియకుండా నాపేరుమీద భూమి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తావు అంటూ ఎమ్మెల్యేను నిలదీసింది. దీంతో ముత్తిరెడ్డి కూతురికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు. తొలుత రిజిస్ట్రేషన్ పత్రాలు తండ్రికి చూపిస్తూ.. ఈ సంతకాలు ఎవరు పెట్టారంటూ నిలదీసింది. ముత్తిరెడ్డి నేనే పెట్టానని చెప్పడంతో.. చేర్యాలలో తనకు తెలియకుండా తనపేరు మీద ల్యాండ్ ఎందుకు కొన్నావు అంటూ తండ్రి ముత్తిరెడ్డిని తుల్జా భవాని ప్రశ్నించింది. తన సంతకం ఫోర్జరీ చేసి తనపేరున భూమి కొని రిజిస్ట్రేషన్ చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తుల్జా భవాని హెచ్చరించింది.
ముత్తిరెడ్డి ఏమన్నారంటే ..
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చేర్యాలలో 1200 గజాలు, జనగామలో 1100 గజాలు కొనిచ్చారని నా కూతురు తుల్జా భవానీ అంటోంది. నా కూతురికి నేను సంపాదించిన ఆస్తి ఇస్తే ఎలా మోసం అవుతుంది అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నాకు తెలియకుండా చేర్యాలలో ల్యాండ్ ఎందుకు కొన్నావని నా కూతురు అంటోందని, ఆస్తులు గుంజుకుంటే, అమ్ముకుంటే తప్పు అవుతుంది. కానీ, ఆస్తి ఇస్తే ఎలా తప్పు అవుతుందని ముత్తిరెడ్డి ప్రశ్నించారు. కొందరు కుట్ర పూరితంగా నా కూతుర్ని నాపై ఉసిగొల్పుతున్నారని ముత్తిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
గతంలో కలెక్టర్ నాపై చెరువు కబ్జా చేశానంటూ నిందలు వేశారని, కానీ ఆ ఆరోపణల్లో నిజం లేదన్నారు. తనపై ఆరోపణలు చేయడం ద్వారా టికెట్ రాకుండా అడ్డుకోవాలని చూశారని, కానీ, సీఎం కేసీఆర్‌కు నాపై నమ్మకం ఉందని, నాకు టికెట్ ఇచ్చి ప్రజల్లోకి పంపించారని, ప్రజలు నన్ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని ముత్తిరెడ్డి అన్నారు. ఇప్పుడు కొందరు చేతగాని దద్దమ్మలు నాపై నా అల్లుడు, కూతురిని ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా సేవ చేయడంలో మాత్రం నేను వెనుకడుగు వేయనని ముత్తిరెడ్డి అన్నారు. నా చివరి శ్వాస వరకు జనగామలోనే ఉంటానని, నేను చనిపోయాక నియోజకవర్గంలోని 376 చెరువుల్లో తన చితాభస్మం కలుపాలని మా అనుచరులకు, కుటుంబ సభ్యులకు చెప్పానని ముత్తిరెడ్డి అన్నారు.
RGV : సీఎం జగన్‌తో మరోసారి ఆర్జీవీ భేటీ.. ఆ సినిమా కోసమేనా?