Cyber Crimes: ఏపీలో ‘సైబర్’ టెర్రర్.. 8 నెలల్లో రూ.600 కోట్లు లూటీ
సీబీఐ, ఈడీ అధికారులం అంటూ సైబర్ కేటుగాళ్లు(Cyber Crimes) ఫోన్ కాల్స్ చేస్తారు.
- By Pasha Published Date - 10:32 AM, Wed - 2 April 25

Cyber Crimes: ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోమంది సైబర్ నేరాల బారినపడుతున్నారు. తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. గత 8 నెలల్లో రాష్ట్రంలో దాదాపు 1,800 మంది సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కి రూ.600 కోట్లు పోగొట్టుకున్నారు. సగటున రోజుకు రూ.2.50 కోట్లను మోసగాళ్లు దోచేశారు. రూ.600 కోట్లలో రూ.61.59 కోట్లను మాత్రమే నేరగాళ్లపరం కాకుండా పోలీసులు ఫ్రీజ్ చేయగలిగారు. సైబర్ నేరగాళ్ల బాధితుల్లో ఎక్కువ మంది ఉద్యోగులే. కొందరు ప్రముఖులు కూడా సైబర్ మోసాల బారినపడటం గమనార్హం. ఈమేరకు వివరాలతో ఏపీ పోలీసు శాఖ ఒక నివేదికను సిద్ధం చేసింది. ఆ వివరాలను చూద్దాం..
Also Read :Vijayasai Reddy : వచ్చే వారమే బీజేపీలోకి విజయసాయి రెడ్డి ? కారణం అదేనా ?
బాధితులు వీరే..
- సైబర్ కేటుగాళ్ల వల్ల దగాపడిన వారిలో 764 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే ఉన్నారు.
- ప్రజల్లో బాగా ప్రాచుర్యమున్న ప్రముఖులు 697 మంది సైబర్ మోసాల బారినపడ్డారు.
- ఎంతోమంది విద్యార్థులు, ఎంట్రప్రెన్యూర్లు, వైద్యులు, వృత్తి నిపుణులూ మోసపోయారు.
- సైబర్ మోసాల బారినపడిన వారిలో 30-45 ఏళ్లవారు 640 మంది, 45-60 ఏళ్లవారు 410 మంది, 18-30 ఏళ్లవారు 391 మంది ఉన్నారు.
- బాధితుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు.
ఇలా మోసపోతున్నారు..
- సీబీఐ, ఈడీ అధికారులం అంటూ సైబర్ కేటుగాళ్లు(Cyber Crimes) ఫోన్ కాల్స్ చేస్తారు. మీరు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని చెబుతూ బ్లాక్ మెయిలింగ్ మొదలుపెడతారు. వీడియో కాల్ చేసి.. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేశామంటారు. భయపెట్టి, ఆందోళనకు గురి చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజుతారు.
- కొరియర్, పార్సిల్ కార్యాలయాల నుంచి కాల్ చేస్తున్నామని సైబర్ కేటుగాళ్లు చెబుతారు. బాధితుల పేరిట వచ్చిన పార్సిళ్లలో డ్రగ్స్, ఆయుధాలు ఉన్నాయంటారు. పోలీసు కేసు నమోదైందని బెదిరిస్తారు. డబ్బులు ఇచ్చాక కేసును కొట్టివేయిస్తామని బుకాయిస్తారు.
- ఇంకొందరు సైబర్ కేటుగాళ్లు ఫోన్ కాల్ చేసి.. తాము బ్యాంకు ఉద్యోగులం అని నమ్మిస్తారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులను అప్‌గ్రేడ్ చేయించుకోవాలని సూచిస్తారు. లేదంటే మరో వారంలో అవి బ్లాక్ అవుతాయని చెబుతారు. ఇది నిజమేనని నమ్మి ప్రస్తుతం వినియోగించే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుకు సంబంధించిన నంబర్లు, సీవీవీ వంటివి చెబితే మన పని అయిపోయినట్టే. అకౌంటులోని డబ్బులన్నీ గాయబ్ అవుతాయి.
- ఇంకొందరు సైబర్ కేటుగాళ్లు న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా ప్రముఖులపైకి వల విసురుతున్నారు. ఆ కాల్స్‌ను రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేయిస్తామని బెదిరిస్తారు. వెంటనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు.