Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట
- Author : Vamsi Chowdary Korata
Date : 09-06-2026 - 9:52 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ప్రభుత్వం కొత్త ప్రైవేట్ విద్యా సంస్థల ఏర్పాటును సులభతరం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా ప్రైవేటు విద్యా సంస్థల చట్టంలో పలు నిబంధనలకు సవరణలు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పస్ ఫండ్, ఇతర నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల విన్నపాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.15 లక్షల కార్పస్ ఫండ్‌ను రద్దు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలకు ఊరటనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీ, పీజీ కోర్సులను ప్రారంభించేందుకు చెల్లించాల్సిన రూ. 15 లక్షల కార్పస్ ఫండ్‌ను రద్దు చేసింది. ఇకపై రూ. 15 లక్షలు కట్టాల్సిన అవసరం లేదని ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కాకపోతే ప్రైవేట్ కాలేజీలు స్థాపించే సమయంలో మాత్రం రూ. 15 లక్షల కార్పస్ ఫండ్ చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ఇకపై కొత్త కోర్సులు ప్రారంభించే సమయంలో చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు ప్రైవేట్ కాలేజీలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రైవేట్ కాలేజీలను అద్దె భవనాల్లో నిర్వహిస్తే.. 30 ఏళ్ల లీజుతో ప్రతి ఏటా అనుమతి పొడిగించుకోవాలని.. దీని కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ప్రైవేట్ కాలేజీలకు 30 ఏళ్ల కంటే ఎక్కువ లీజు వ్యవధి ఉంటే సొంత భవనంగా భావిస్తారు.. అద్దె భవనంలో కొనసాగడానికి అనుమతిస్తారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సుల అనుమతికి సంబంధించి ప్రాంతాల వారీగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో బీఏ కోర్సు అనుమతి కోసం రూ.30 వేలు చెల్లించాలి. గ్రామీణ ప్రాంతంలో రూ.40 వేలు, పట్టణ ప్రాంతంలో రూ.50 వేలు చెల్లించాలని సూచించారు. బీఎస్సీ, బీకామ్ కోర్సులకు ఫీజులు వేర్వేరుగా ఉన్నాయి.
ప్రైవేట్ కాలేజీలలో తనిఖీలకు డేటా అనలిటిక్స్, ఏఐ, ఇతర సాంకేతికతలను వినియోగించొచ్చని ఏపీ ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఆరేళ్లు పాటు ప్రైవేట్ కాలేజీకి సంబంధించి కార్యకలాపాలు నిర్వహించకపోతే అనుమతి పునరుద్ధరించరు. ప్రతి ప్రైవేట్ డిగ్రీ కాలేజీ కచ్చితంగా తన వెబ్‌సైట్‌ను పూర్తి వివరాలతో అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించారు. ప్రతి ఏటా సెప్టెంబరు 30లోపు వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసుకోవాలన్నారు. కాలేజీలు తప్పనిసరిగా గత మూడేళ్లలో మంజూరైన సీట్లు, ప్రవేశాలు, ఉత్తీర్ణత, లెక్చరర్ల అర్హతలు వంటి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ఎవరైనా నకిలీ ధ్రువీకరణ పత్రాలు, తప్పుడు సమాచారాన్ని అందిస్తే రూ.లక్షల జరిమానా విధిస్తారు.. అలాగే క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తారు.