Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 4 జిల్లాల్లో 12 కొవిడ్ కేసులు
- Author : Vamsi Chowdary Korata
Date : 17-07-2026 - 10:10 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ కేసులు మరోసారి టెన్షన్ పెడుతున్నాయి. కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. తాజాగా కొవిడ్ కేసులపై వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 12 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, బాధితుల్లో నలుగురు చనిపోయినట్లు ప్రకటించారు. చనిపోయినవారు కడప జిల్లాలో ముగ్గురు, కాకినాడ జిల్లాలో ఒకరు మృతిచెందారని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ తెలిపారు. కొవిడ్ పాజిటివ్‌గా తేలి చనిపోయిన నలుగురికి తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం 12 కేసుల్లో కడప జిల్లాలో ఎనిమిది, గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని వీరపాండియన్ తెలిపారు. కొవిడ్ పాజిటివ్ తేలినవారికి సన్నిహితంగా మెలిగిన వారు ఇద్దరు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఒకవేళ అనుమానిత లక్షణాలు ఉంటే ఆసుపత్రులకు వెళ్లాలన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కొవిడ్ కేసులకు సంబంధించి వైరస్ జన్యు క్రమ స్వరూపాన్ని గుర్తించేందుకు ఐదు శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు.
జూన్ 26 నుంచి జులై 16 వరకు నాలుగు జిల్లాల్లో 12 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 67 మందికి చెందిన శాంపిల్స్ పరీక్షిస్తే, 11 మందికి పాజిటివ్‌గా తేలింది. కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తికి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సీఎంసీలో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
విశాఖపట్నంలో కొవిడ్ పాజిటివ్ తేలిన వ్యక్తి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి జ్వరం, తలనొప్పితో బాధపడుతుండటంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తే పాజిటివ్‌గా తేలింది. ఆయన భార్యకు పరీక్ష నిర్వహించగా, ఆమెకు నెగిటివ్‌గా వచ్చింది.
నమోదైన కొవిడ్ కేసులు వేర్వేరు జిల్లాల్లో ఉన్నాయి. పాజిటివ్ తేలినవారిలో ముగ్గురు హోం క్వారంటైన్లో ఉండగా, ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం డాక్టర్లు, ఆస్పత్రులు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా జులై 1 నుంచి 339 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్‌లో 18, దిల్లీలో 18, రాజస్థాన్‌లో 12, ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎంహెచ్వోలు, జీజీహెచ్‌లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లను అలర్ట్ చేశారు. ఇప్పటికే అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్లు, వీటీఎం, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్, మందులు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఆసుపత్రుల్లో కొవిడ్ వార్డులు ఏర్పాటు చేసి, అవసరమైన యాంటీబయాటిక్స్, ఇతర సాధారణ మందులు అందుబాటులో ఉంచుతున్నారు. బీపీ, షుగర్ సహా దీర్ఘకాలిక సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద కొవిడ్ భయం మరోసారి జనాల్ని వణికిస్తోంది.