Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు
- Author : Vamsi Chowdary Korata
Date : 01-06-2026 - 11:57 IST
Published By : Hashtagu Telugu Desk
కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయాలకు తొలి మహిళా బాధితురాలిని తానేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బ్రిటిష్ వారు అనుసరించిన నిరంకుశ విధానాలనే, నేడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తోందని, అరాచకాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.
గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొండంత అండ లభించిందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా మహిళలను రోడ్డున పడేసేలా ప్రవర్తిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ’ యాప్‌ను కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆమె మండిపడ్డారు.
చంద్రబాబు రాజకీయ విధానాన్ని ఆమె ‘ఎడారి – ఒంటె’ కథతో పోల్చారు. అవసరమైనప్పుడు కాళ్లు పట్టుకోవడం, అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకోవడం ఆయనకు అలవాటని తీవ్రంగా విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీని లాక్కున్న నల్లటి చరిత్ర చంద్రబాబుదేనని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.