Gorantla Madhav: లోక్ సభలోకి చొరబడిన దుండగుడిని చితకబాదిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్..
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. లోక్ సభలో టియర్ గ్యాస్ వదలడంతో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు
- Author : Praveen Aluthuru
Date : 13-12-2023 - 5:40 IST
Published By : Hashtagu Telugu Desk
Gorantla Madhav: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. లోక్ సభలో టియర్ గ్యాస్ వదలడంతో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని ఓం బిర్లా హామీ ఇచ్చారు. దానికి పూర్తి బాధ్యత తనదేనని వెల్లడించారు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో జీరో అవర్ జరుగుతుండగా.. ఇద్దరు దుండగులు హడావిడిగా ఎంపీలు కూర్చున్న సోఫాలపై నుంచి దూకారు. ఈ అనూహ్య ఘటనతో భయప్రాంతాలకు గురైన ఎంపీలు పరుగులు తీశారు.కొందరు దుండగులను పట్టుకుని చితకబాదారు. వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ధైర్యం చేసి బెంచ్ లపై నుంచి దూకి దుండగుడి వీపుపై పిడిగుద్దులు గుద్దారు. అనంతరం ఈ ఘటనపై గోరంట్ల మాధవ్ మాట్లాడారు. గ్యాలరీ ఎత్తు లేకపోవడంతో దుండగులు ఈజీగా లోపలి ప్రవేశించినట్లు ఆయన అన్నారు. అయితే ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని అభిప్రాయపడ్డారు గోరంట్ల.
లోక్‌సభలోకి ప్రవేశించిన ఇద్దరు నిందితుల నుంచి వస్తువులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. లోక్‌సభలోకి చొరబాటుదారుల ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని ఎంపీలకు తెలిపారు. విచారణ పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. నలుగురు నిందితుల్లో ఒక మహిళ ఉన్నట్లు సమాచారం. బీజేపీకి చెందిన మైసూరు ఎంపీ ప్రతాప్ పేరుతో నిందితులు పాస్‌లతో పార్లమెంట్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
అయితే సభలోకి ప్రవేశించిన నిందితులు సాధారణ పొగనే వదిలినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని స్పీకర్ తెలిపారు. పొగపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీలకు సూచించారు. కానీ నిందితులు విడుదల చేసిన గ్యాస్ పై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు.శాంతిభద్రతలపై ఎంపీల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లోక్ సభను సజావుగా నడపాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పీకర్ ఓం బిర్లా హితవు చెప్పారు.
Also Read: Potlakaya Masala Rolls: వెరైటీగా ఉండే పొట్లకాయ మసాలా రోల్స్.. ట్రై చేయండిలా?