Nara Lokesh: వైసీపీ ఇసుక మాఫియాతో పర్యావరణానికి ప్రమాదం: లోకేశ్
ఇసుక కొనాలంటే బంగారమైపోయేలా చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
- Author : Balu J
Date : 22-02-2023 - 5:36 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవంతంగా అమలైన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి, కొత్త విధానం అమలు చేసిన వైసీపీ సర్కారు దెబ్బకి ఇసుక కొనాలంటే బంగారమైపోయేలా చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం, మోదుగులపాలెం స్వర్ణముఖి నది లో లెవల్ కాజ్ వేని ఆయన పరిశీలించారు. అనుమతులు లేకపోయినా వైసిపి నాయకులు ప్రతి రోజూ 300 టిప్పర్లు ఇసుకను ఇక్కడి నుంచే అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు వివరించారు.
అక్రమ ఇసుక రవాణా కారణంగా లో లెవల్ కాజ్ వే పూర్తిగా దెబ్బతిందని, ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలని ఎన్ని సార్లు ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ఇసుక మాఫియాతో పర్యావరణానికి ప్రమాదం పొంచి వుందన్నారు. సామాన్యులకు ఇసుక దొరకకుండా చేసిన విధానంతో భవననిర్మాణ రంగం ఆధారపడిన కూలీలకు పనిలేకుండా పోయిందని, అనుబంధం రంగాలన్నీ సంక్షోభంలో పడ్డాయని వివరించారు.