వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్) ప్రణవ్ మేర్ మాట్లాడుతూ.. విపరీతమైన పెరుగుదల తర్వాత ధరల్లో ఇలాంటి పతనం సహజమని అన్నారు.
- Author : Gopichand
Date : 02-02-2026 - 9:32 IST
Published By : Hashtagu Telugu Desk
Silver Price Predictions: గత కొన్ని వారాలుగా చారిత్రాత్మక గరిష్ట స్థాయిలను తాకిన వెండి ధరలు ప్రస్తుతం భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్ సమయంలో ఎంసీఎక్స్‌లో వెండి ధర దాదాపు 6 శాతం అంటే సుమారు రూ. 17,000 వరకు పడిపోయింది. ఫిబ్రవరి 2న ఎంసీఎక్స్‌లో వెండి ధర కిలోకు రూ. 2,48,799 స్థాయికి పడిపోయింది. గతంలో ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 4 లక్షల నుండి రూ. 4.20 లక్షల స్థాయిని తాకగా, ఇప్పుడు ధరలు జారి రూ. 2.50 లక్షల నుండి రూ. 2.60 లక్షల పరిధిలోకి చేరుకున్నాయి.
వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
వెండి ధరల్లో వచ్చిన ఈ భారీ పతనం గురించి ‘ఎన్రిచ్ మనీ’ సీఈఓ పొన్ముడి ఆర్. మాట్లాడుతూ.. ఇది భారీ పెరుగుదల తర్వాత వచ్చిన సహజమైన ‘కన్సోలిడేషన్’ అని పేర్కొన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, కామెక్స్ (Comex) వెండి ప్రస్తుతం 75 నుండి 85 డాలర్ల కీలక కన్సోలిడేషన్ జోన్లో ట్రేడవుతోంది. అంతకుముందు ఇది 121.6 డాలర్ల రికార్డ్ స్థాయిని తాకింది. వెండి ధరలు ఇప్పటికీ సానుకూల ధోరణిలోనే ఉన్నాయని, అయితే ఇటీవలి విపరీతమైన పెరుగుదల కారణంగా ధరలు ‘ఓవర్‌బాట్ జోన్’ (Overbought zone) లోకి వెళ్లాయని, దీనివల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ధరలు తగ్గాయని ఆయన వివరించారు. ఈ పతనం ట్రెండ్ ముగిసిపోవడానికి సంకేతం కాదని, ధరల్లో ఒక ఆరోగ్యకరమైన విరామమని ఆయన పేర్కొన్నారు.
జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్) ప్రణవ్ మేర్ మాట్లాడుతూ.. విపరీతమైన పెరుగుదల తర్వాత ధరల్లో ఇలాంటి పతనం సహజమని అన్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం, దేశీయ మార్కెట్లో ఆదివారం జరిగిన భారీ అమ్మకాల మధ్య బంగారం తన గరిష్ట స్థాయి నుండి 20 శాతం పడిపోగా, వెండి తన గరిష్ట స్థాయి నుండి సుమారు 37 శాతం పడిపోయింది.
Also Read: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక గాంధీ!
మున్ముందు ఏం జరగనుంది?
కామెక్స్‌లో ఏప్రిల్ డెలివరీ బంగారం ఫ్యూచర్స్ గురువారం 5,626.8 డాలర్ల కొత్త రికార్డును సృష్టించింది. కానీ ఆ తర్వాత 11.39 శాతం పడిపోయి 4,763.10 డాలర్ల వద్ద ముగిసింది. అదేవిధంగా మార్చి డెలివరీ వెండి గురువారం 121.78 డాలర్ల చారిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకినప్పటికీ శుక్రవారం నాటికి 31.37 శాతం పడిపోయి 78.53 డాలర్ల వద్ద స్థిరపడింది.
ధరల పతనానికి ప్రధాన కారణాలు
ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు: సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలతో అమెరికన్ డాలర్ బలపడింది. దీనివల్ల బంగారం, వెండి ధరలపై ఒత్తిడి పెరిగింది.
డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ ఫెడరల్ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను తదుపరి ఫెడ్ చైర్మన్‌గా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.
ప్రణవ్ మేర్ అంచనా ప్రకారం, రాబోయే కొన్ని ట్రేడింగ్ సెషన్లలో ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది (టెక్నికల్ కరెక్షన్). ఆ తర్వాత ధరల్లో కొంత స్థిరత్వం ఏర్పడి, స్వల్పంగా కోలుకునే అవకాశం కనిపిస్తోంది.