YS Sharmila: ఆటో డ్రైవర్లను మోసగించడంలో దొందు దొందే: వైఎస్ షర్మిల
అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీలు ఇచ్చి, పథకంలో కోత పెట్టేందుకు 18 నిబంధనలు ఎందుకు పెట్టారని షర్మిల ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
- By Gopichand Published Date - 08:13 PM, Sun - 5 October 25

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ‘బారెడు’ ఉంటే వాటి అమలు మాత్రం ‘మూరెడు’ మాత్రమే ఉందని ఆమె ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లను మోసగించడంలో ఎలాంటి తేడా లేదని ఆమె ఆరోపించారు.
‘వాహన మిత్ర’ పథకంలో ఘరానా మోసం
ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 15 వేలు ఇస్తామన్న హామీని అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని షర్మిలా రెడ్డి మండిపడ్డారు. “ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఎన్నికల ప్రసంగాలకు, ఇప్పుడు అమలు చేసిన రూ. 15 వేల పథకానికి ఎక్కడా పొంతన లేదు. ఖాకీ చొక్కాలు వేసుకుని, ఆటోల్లో తిరిగినట్లు ఫోటోలకు ఫోజులిచ్చి, వారి కుటుంబాలను ఉద్ధరించినట్లు కాకమ్మ కబుర్లు చెప్పి, డ్రైవర్ అన్నలకు మసి పూసి మారేడుకాయ చేశారు” అని ఆమె ధ్వజమెత్తారు.
Also Read: HYDRAA: రూ. 3,600 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా!
రాష్ట్రంలో ఆర్టీఏ లెక్కల ప్రకారం సుమారు 15 లక్షల మంది బ్యాడ్జ్ కలిగిన డ్రైవర్లు ఉంటే కూటమి ప్రభుత్వం కేవలం 2.90 లక్షల మందికే ఈ పథకాన్ని అందించింది. గత వైసీపీ ప్రభుత్వం 2.60 లక్షల మందికి ఇస్తే చంద్రబాబు కేవలం 30 వేల మందికి మాత్రమే అదనంగా ఇచ్చి 13 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను విస్మరించారని మండిపడ్డారు. “ఆటో డ్రైవర్లను మోసగించడంలో గత వైసీపీ ప్రభుత్వానికి నేటి కూటమి ప్రభుత్వానికి తేడా లేదు. ఇద్దరూ దొందు దొందే” అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నిబంధనలతో కోతలే
అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీలు ఇచ్చి, పథకంలో కోత పెట్టేందుకు 18 నిబంధనలు ఎందుకు పెట్టారని షర్మిల ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఓనర్ కమ్ డ్రైవర్ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారని, ఆటో తోలుకొని బ్రతికే పేద డ్రైవర్లను ఎలా విస్మరించారని నిలదీశారు. అన్ని మాటలు చెప్పి కేవలం 10 శాతం మందికి మాత్రమే పథకం ఇవ్వడం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిలా రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొన్ని డిమాండ్లు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 13 లక్షల మంది డ్రైవర్లకు పథకాన్ని వర్తింపజేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ. 15 వేల చొప్పున వారి అకౌంట్లలో వేయాలి. ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ వెహికల్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్‌కు కూడా రూ. 15 వేలు అందించాలి. అన్ని వర్గాల డ్రైవర్లతో కూడిన సాధికార సంస్థను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని, ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.