మీకు బైక్ లేదా కారు ఉందా? అయితే ఇది మీకోసమే!
ఈ రోజుల్లో వస్తున్న దాదాపు అన్ని వాహనాలకు స్మార్ట్ కీలు లేదా కీ-ఫోబ్స్ వస్తున్నాయి. వాటిలో కూడా ఒక 'ఎమర్జెన్సీ కీ' ఉంటుంది.
- Author : Gopichand
Date : 19-03-2026 - 7:55 IST
Published By : Hashtagu Telugu Desk
Metal Tag: సాధారణంగా మనం కొత్త కారు లేదా బైక్ కొన్నప్పుడు తాళం చెవితో పాటు ఒక చిన్న మెటల్ ట్యాగ్ వస్తుంది. చాలా మంది దీనిని అనవసరమైనదిగా భావించి వెంటనే తీసేయడమో లేదా ఎక్కడో పడేయడమో చేస్తారు. కానీ ఆ చిన్న వస్తువే భవిష్యత్తులో మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల నుండి కాపాడుతుంది. నిజానికి అది సాధారణ ముక్క కాదు, మీ వాహన భద్రతకు సంబంధించిన కీలక సమాచారం అందులో దాగి ఉంటుంది.
ఈ మెటల్ ట్యాగ్‌లో ఏముంటుంది?
ఈ చిన్న అల్యూమినియం లేదా మెటల్ ట్యాగ్‌పై కొన్ని అంకెలు రాసి ఉంటాయి. వీటిని ‘కీ కోడ్’ (Key Code) అని పిలుస్తారు. ఈ కోడ్ మీ వాహనం తాళం చెవికి ఒక రకమైన ప్రత్యేక గుర్తింపు. చాలా మంది దీని ప్రాముఖ్యతను గుర్తించరు. కానీ కష్టకాలంలో ఇదే మీకు పెద్ద దిక్కుగా మారుతుంది.
తాళం చెవి పోతే ఇదే ఆధారం
ఒకవేళ మీ వాహనం తాళం చెవి పోయినా లేదా రెండు తాళాలు ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఈ కీ కోడ్ మీకు సహాయపడుతుంది. గతంలో ఇలాంటి పరిస్థితి వస్తే లాక్ సెట్ మొత్తాన్ని మార్చాల్సి వచ్చేది. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు ఈ కోడ్ సహాయంతో కొత్త తాళం చెవిని తయారు చేయడం చాలా సులభం.
Also Read: బీసీసీఐ ముందు అజిత్ అగార్కర్ బిగ్ రిక్వెస్ట్.. ఏంటంటే?
కొత్త తాళం చెవి ఎలా తయారవుతుంది?
మీరు ఈ కీ కోడ్‌ను అధీకృత సర్వీస్ సెంటర్లో ఇస్తే అక్కడ ఉండే యంత్రాలు ఆ కోడ్ ఆధారంగా కొత్త తాళం చెవిని సిద్ధం చేస్తాయి. ఈ కొత్త తాళం సరిగ్గా పాత దానిలాగే పనిచేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ కోడ్ లేకపోతే కొత్త తాళం చేయించుకునే ప్రక్రియ చాలా కష్టంతో కూడుకున్నది. ఖర్చు కూడా ఎక్కువే.
స్మార్ట్ కీలకు కూడా ఇది అవసరం
ఈ రోజుల్లో వస్తున్న దాదాపు అన్ని వాహనాలకు స్మార్ట్ కీలు లేదా కీ-ఫోబ్స్ వస్తున్నాయి. వాటిలో కూడా ఒక ‘ఎమర్జెన్సీ కీ’ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ కీని మళ్లీ తయారు చేయించుకోవాలన్నా ఈ కీ కోడ్ తప్పనిసరి. అంతేకాదు తాళం చెవి దొంగిలించబడితే ఈ కోడ్ సహాయంతో పాత తాళం పని చేయకుండా సిస్టమ్ నుండి తొలగించవచ్చు.
భద్రత పరంగా ఎందుకు ముఖ్యం?
ఈ మెటల్ ట్యాగ్ ఎంత ఉపయోగకరమో, అంతే సున్నితమైనది కూడా. దీనిపై ఉండే కీ కోడ్ మీ వాహనానికి ఒక రకమైన ‘డిజిటల్ ఫింగర్ ప్రింట్’ లాంటిది. ఇది ఎవరైనా తప్పుడు వ్యక్తుల చేతికి చిక్కితే వారు సులభంగా మీ వాహనానికి డూప్లికేట్ కీ తయారు చేయించి దొంగిలించే ప్రమాదం ఉంది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి.
దీనిని ఎక్కడ, ఎలా భద్రపరుచుకోవాలి?
- ముందుగా ఆ ట్యాగ్‌ను తాళం చెవితో కలిపి ఉంచకండి.
- దీనిని ఇంట్లో ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో లేదా వాహనానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు భద్రపరచండి.
- ముందు జాగ్రత్తగా ఆ కోడ్ ఫోటో తీసి మీ ఫోన్ లేదా ఈమెయిల్లో సేవ్ చేసుకోవడం ఉత్తమం.
- తర్వాతి సారి మీరు కొత్త వాహనం కొన్నప్పుడు ఆ చిన్న మెటల్ ట్యాగ్‌ను పనికిరానిదిగా భావించి పారేయకండి. అవసరమైనప్పుడు అదే మీకు కొండంత అండగా నిలుస్తుంది.