HYDRAA: రూ. 3,600 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా!
ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమణదారుల చెర నుంచి 'హైడ్రా' స్వాధీనం చేసుకుంది.
- By Gopichand Published Date - 08:03 PM, Sun - 5 October 25

HYDRAA: “నీరు పల్లమెరుగు” అనే సామెతకు విరుద్ధంగా ఆధునిక భారతీయ నగరాలు ప్రస్తుతం వర్షపు నీరు ఇంకే మార్గం లేక వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. భూతాపం, వాతావరణ మార్పుల కారణంగా కుండపోత వానలు కురుస్తున్నప్పుడు కాంక్రీట్ అరణ్యాలుగా మారిన పట్టణాల్లోని ప్రజలు ట్రాఫిక్‌లో కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయి నరకం అనుభవిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితికి ప్రధాన కారణం. ప్రకృతి జీవనాడులైన చెరువులు, కుంటలు, వాగులు కబ్జా కోరల్లో చిక్కుకోవడమే.
జల వనరుల కబ్జా
సాధారణంగా వరద నీరు తన దారిన పోయి స్థానిక చెరువులు, కుంటలు, జల వనరులలోకి చేరి తాగు, సాగు అవసరాలను తీరుస్తుంది. అంతేకాక భూగర్భ జలాలను పెంచడం, ఉష్ణోగ్రతను తగ్గించడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే స్థిరాస్తి రంగానికి రెక్కలొచ్చి, పట్టణ భూములకు డిమాండ్ పెరగడంతో కబ్జారాయుళ్ల కన్ను ఈ వనరులపై పడింది. నిజమైన ప్రజాసంక్షేమం పట్టని నాయకుల అండదండలు దండిగా అందడం, అలాగే లంచాలకు అర్రులు చాచే అధికారుల సహకారం లభించడం వల్ల కబ్జాదారులు ఎలాంటి భయం లేకుండా దందాలు కొనసాగిస్తున్నారు.
అక్రమ నిర్మాణాల పెరుగుదల
హైదరాబాద్‌లో పుప్పాలగూడ, మియాపూర్, మూసాపేట వంటి ప్రాంతాలలో చెరువు భూముల్లోనే వందల కోట్ల రూపాయల విలువైన భారీ భవనాలు యథేచ్ఛగా మొలుచుకొస్తున్నాయి. ఈ అక్రమ కట్టడాల వల్ల నీరు ఇంకే మార్గం లేక, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. జలశక్తి శాఖ గణన ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 38 వేల జల వనరులు ఆక్రమణల పాలయ్యాయి. వీటిలో అత్యధికం ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 2000 సంవత్సరంలో హైదరాబాద్ చుట్టూ జల వనరుల విస్తీర్ణం 12,500 హెక్టార్లు ఉండగా.. కేవలం రెండు దశాబ్దాల కాలంలో అది 2,000 హెక్టార్లకు కుంచించుకుపోయింది. ఇదే కాలంలో నగరంలో నిర్మాణ ప్రాంతాల వైశాల్యం రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. విభజనకు ముందు హైదరాబాద్‌లో ఉన్న 820 చెరువులు అనంతర కాలంలో మాయమయ్యాయి.
Also Read: Coldrif Syrup: తెలంగాణలో ‘కోల్డ్‌రిఫ్’ సిరప్ నిషేధం!
బెంగళూరు నగర స్థాపకుడు కెంపేగౌడ నిర్మించిన వేల చెరువుల్లో 837 చెరువులు కబ్జాల పాలయ్యాయి. కాకతీయులు తెలంగాణలో సాగు, తాగు అవసరాల కోసం నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలకు గురవడంతో వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, విజయవాడ, నెల్లూరు వంటి నగరాలు తరచూ ముంపుకు గురవుతున్నాయి. చెరువులను నామరూపాలు లేకుండా చేయడమంటే పర్యావరణ వ్యవస్థను, జనజీవితాన్ని సర్వనాశనం చేయడమే. చిల్లర దొంగలకు శిక్షలు వేస్తున్నప్పుడు, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న అవినీతిపరులైన అసురగణాలకు మరింత కఠిన శిక్షలు పడాలి.
హైడ్రా మరో కీలక విజయం
ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమణదారుల చెర నుంచి ‘హైడ్రా’ స్వాధీనం చేసుకుంది. మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 3,600 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు ‘హైడ్రా’ నిర్వహించిన ఆపరేషన్లలో విలువ పరంగా ఇది రెండో అతిపెద్ద రికవరీగా నమోదైంది.
హైకోర్టు ఆదేశాలతో చర్యలు
కొండాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఉన్న సర్వే నంబర్ 59లోని ఈ భూమి చాలా సంవత్సరాలుగా అక్రమణదారుల ఆధీనంలో ఉంది. ఈ భూమిపై హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ‘హైడ్రా’ అధికారులు, పోలీసుల సహకారంతో చురుగ్గా చర్యలు చేపట్టారు. భూమిపై అక్రమంగా ఏర్పాటు చేసిన డజన్ల కొద్దీ తాత్కాలిక వాణిజ్య షెడ్లను అధికారులు తొలగించారు. ఆక్రమణదారులు తిరిగి ఆ ప్రాంతంలోకి రాకుండా ఉండేందుకు భూమి చుట్టూ వెంటనే కంచె (ఫెన్సింగ్) వేసి అది ప్రభుత్వ ఆస్తి అని ప్రకటించే బోర్డులను ఏర్పాటు చేశారు.
పశ్చిమ కారిడార్‌లో కీలక రికవరీ
ఈ తాజా రికవరీకి వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ భూమి హైదరాబాద్‌లోని వేగంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ కారిడార్‌లో ఉండటం, ఐటీ విస్తరణ- రియల్ ఎస్టేట్ డిమాండ్ కారణంగా ఈ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరగడం దీనికి ప్రధాన కారణం.
గతంలోనూ రూ. 15,000 కోట్ల రికవరీ
‘హైడ్రా’ ఇంతకుముందు సెప్టెంబర్‌లో మెదక్ జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారంలో ఒక భారీ ఆపరేషన్ నిర్వహించింది. అక్కడ ఏకంగా 317 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ భూమి విలువ దాదాపు రూ. 15,000 కోట్లు ఉంటుందని అంచనా. ఆ భూమిని అక్రమ లేఅవుట్‌లుగా విభజించి, అమాయక కొనుగోలుదారులకు విక్రయించినట్లు అప్పట్లో అధికారులు గుర్తించారు.