CM Chandrababu: సూపర్ సిక్స్ పథకాల అమలు, పార్టీ వ్యవహారాలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "ఎమ్మెల్యేలు, నేతలు వ్యక్తిగతంగా చేసే పనులు, చర్యలు, ఘటనలు పార్టీకి చెడ్డపేరు తెస్తాయి. నేతల తప్పుల వల్ల పార్టీకి నష్టం కలిగే పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాలి?" అని ప్రశ్నించారు.
- By Gopichand Published Date - 07:53 PM, Sun - 17 August 25

CM Chandrababu: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల అమలు తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పార్టీ వర్గాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ పథకం, ఉచిత బస్సు ప్రయాణంపై పార్టీ శ్రేణులు చేపట్టిన కార్యక్రమాల గురించి చర్చించారు.
సూపర్ సిక్స్ పథకాలపై సమీక్ష
సమీక్షలో పార్టీ వర్గాలు ముఖ్యమంత్రికి తెలిపిన వివరాల ప్రకారం ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణంపై అన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, దీనితో వైఎస్సార్‌సీపీ అంతర్మథనంలో పడి తప్పుడు ప్రచారాలకు దిగుతోందని పార్టీ నేతలు వివరించారు. ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని, ప్రజలతో మమేకమవడం ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
Also Read: KL Rahul: ఆసియా కప్ 2025 నుంచి తప్పుకున్న కేఎల్ రాహుల్.. రీజన్ ఇదే?!
ఎమ్మెల్యేల వ్యవహారాలపై అసంతృప్తి
ఈ సందర్భంగా ఇటీవల ఎమ్మెల్యేల కేంద్రంగా తలెత్తిన పలు వివాదాలు, ఘటనలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలపై వచ్చిన వార్తలపై, అలాగే అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఎవరూ చేసినా సహించేది లేదని ఆయన అనంతపురం ఘటనపై తీవ్రంగా స్పందించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతల వ్యవహారం చిన్న విమర్శకు కూడా తావిచ్చేలా ఉండకూడదని ఆయన సూచించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానిలో తప్పు లేకపోయినా, తప్పుడు ప్రచారం జరుగుతున్నా నేతలు వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “ఎమ్మెల్యేలు, నేతలు వ్యక్తిగతంగా చేసే పనులు, చర్యలు, ఘటనలు పార్టీకి చెడ్డపేరు తెస్తాయి. నేతల తప్పుల వల్ల పార్టీకి నష్టం కలిగే పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాలి?” అని ప్రశ్నించారు. ఈ మూడు ఘటనలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి నివేదిక కోరారు.