Kadambari Jethwani Case: కాదంబరి జేత్వాని కేసులో ఏపీ పోలీసుల విచారణ, సీఎం చంద్రబాబు ఆదేశాలు
ముంబయికి చెందిన నటి కాదంబరి జెత్వానిని అక్రమంగా విజయవాడకు తీసుకు వచ్చి, చిత్రహింసలకు గురి చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు నటిని ఆన్ లైన్ లో విచారించారు.
- By Praveen Aluthuru Published Date - 08:43 AM, Fri - 30 August 24

Kadambari Jethwani Case: రాజకీయ నాయకుల మెప్పు పొందడం కోసం అమాయకులను అక్రమ కేసులలో ఇరికిస్తూ, వారిని చిత్రహింసలకు గురిచేయడం పోలీసులకు అలవాటుగా మారింది. తాజాగా ఓ నటి విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ముంబయికి చెందిన నటి కాదంబరి జెత్వానిని అక్రమంగా విజయవాడకు తీసుకు వచ్చి, చిత్రహింసలకు గురి చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. నటిపై అక్రమంగా కేసు నమోదు చేసి నిర్బంధించిన వైనం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు ఈ కేసుపై ప్రస్తుత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు నటిని ఆన్ లైన్ లో విచారించారు.
కాదంబరి జెత్వాని అక్రమ అరెస్టుకు పాల్పడిన విషయం, అప్పటి ప్రభుత్వం, పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురిచేసిన తీరు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ఏపీ పోలీసు బృందం పని చేసిందని మీడియాలో తీవ్ర ఆరోపణలు రావడంతో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి కేసుపై సమగ్ర విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమె స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో రికార్డ్ చేసి, ఆపై విచారణలో చట్టబద్ధంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులను కోరారు. అయితే నటిని పోలీసులు సంప్రదించగా, ప్రభుత్వం తనకు రక్షణ కల్పిస్తే తాను ఏపీకి వచ్చి విచారణకు సహకరిస్తానని చెప్పింది. దీంతో కేసు విచారణకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఏసీపీ కె స్రవంతి రాయ్‌లను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆమె గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోగా, అక్కడ ఉన్న ఏపీ పోలీసులు అవసరమైన రక్షణ కల్పించి, ఆమె వాంగ్మూలం తీసుకుని ఫిర్యాదు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసులో నటి వాంగ్మూలం సంచలనంగా మారింది. నన్ను ఆటబొమ్మలా వాడుకున్నారని ఆమె చెప్పడం షాకింగ్ కు గురి చేస్తుంది. గత ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు,, ఉన్నతస్థాయి పోలీస్ అధికారులు నన్ను, నా కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారని తెలిపింది. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పింది నటి కాదంబరి జెత్వాని.
Also Read: X Down: ఎక్స్‌లో మరోసారి అంతరాయం.. యూఎస్‌లో 37వేల ఫిర్యాదులు..!