Anil Ambani : అచ్యుతాపురం సెజ్ వైపు.. అనిల్ అంబానీ చూపు.. ఎందుకు ?
ఈసందర్భంగా అనిల్ అంబానీని(Anil Ambani) ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
- By Pasha Published Date - 09:41 AM, Sun - 12 January 25

Anil Ambani : రిలయన్స్ పవర్ కంపెనీ అధినేత అనిల్ అంబానీ చూపు.. ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) వైపు ఉంది. ఈక్రమంలో శనివారం రోజు ఆయన స్వయంగా వచ్చి అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో భూములను పరిశీలించారు. ఇంతకీ అనిల్ అంబానీ స్వయంగా ఎందుకు వచ్చారు ? ఆ సెజ్‌లో ఆయన ఏ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు ? అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Also Read :Robbers In Trains : సంక్రాంతి రద్దీ.. రైళ్లలో దొంగల ముఠాలు.. పారా హుషార్
సీఈఓ వస్తారనుకుంటే.. అనిల్ అంబానీయే వచ్చారు
అచ్యుతాపురం నాన్ సెజ్ పరిధిలో ఉన్న 1200 ఎకరాల్లో రూ. 1.85 లక్షల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కానుంది. దీనికి ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. మోడీ వచ్చి వెళ్లిన మూడురోజుల వ్యవధిలోనే అనిల్ అంబానీ వచ్చి అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో భూములను పరిశీలించారు. వాస్తవానికి భూముల పరిశీలన కోసం రిలయన్స్ పవర్ కంపెనీ సీఈఓ వస్తారని అందరూ అనుకున్నారు. అయితే స్వయంగా అనిల్ అంబానీ ఛార్టర్ ఫ్లైట్‌లో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో పర్యటించారు. భూములను పరిశీలించారు. ఏపీఐఐసీ అధికారులు ఆయనతో వెళ్లి నాన్‌సెజ్ ప్రాంతంలో ఉన్న భూములను చూపించారు.
Also Read :Handloom Mark : తెలంగాణ చేనేత వస్త్రాలపై ఇక ‘హ్యాండ్లూమ్ మార్క్’.. ఏమిటిది ?
ఈసందర్భంగా అనిల్ అంబానీని(Anil Ambani) ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ప్రభుత్వం అనుమతిస్తే.. దాదాపు 1500 ఎకరాల్లో సోలార్ ప్లేట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ భావిస్తోందట. దీనివల్ల ఏపీలో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు.వెయ్యి ఎకరాల పరిధిలో బ్రాండిక్స్ అపెరల్ సిటీ ఏర్పాటుకావడంతో అచ్యుతాపురం పరిధిలో మహిళల ఉపాధికి భరోసా కలిగింది. త్వరలో ఇక్కడ ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్‌హైడ్రోజన్ హబ్ నిర్మించనున్నారు. దీని ద్వారా మరింత మందికి ఉపాధి లభిస్తుంది.