Handloom Mark : తెలంగాణ చేనేత వస్త్రాలపై ఇక ‘హ్యాండ్లూమ్ మార్క్’.. ఏమిటిది ?
. ఈక్రమంలోనే తెలంగాణలో తయారయ్యే చేనేత ఉత్పత్తులపైనా డిస్‌ప్లే చేసేందుకు ప్రత్యేకమైన హ్యాండ్లూమ్ మార్క్ లోగోను(Handloom Mark) తయారు చేశారు.
- By Pasha Published Date - 08:06 AM, Sun - 12 January 25

Handloom Mark : చేనేత చీరలు, ఇతరత్రా చేనేత ఉత్పత్తులకు తెలంగాణ రాష్ట్రం పెట్టింది పేరు. దీనికి దేశంలో ఖ్యాతిని పెంచే దిశగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇక నుంచి తెలంగాణలో తయారయ్యే చేనేత ఉత్పత్తులపై ప్రత్యేకమైన హ్యాండ్లూమ్ మార్క్ (లోగో)ను ముద్రించనున్నారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తెలంగాన చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
Also Read :Satellites Handshake : ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’లో కీలక ఘట్టం.. రెండు శాటిలైట్ల కరచాలనం
హ్యాండ్లూమ్ మార్క్‌లో ఏమేం ఉంటాయంటే..
ప్రస్తుతం దేశంలో సిల్క్ చీరలను గుర్తించేందుకు సిల్క్‌మార్క్ ఉంది. చేనేత వస్త్రాలకు హ్యాండ్లూమ్ మార్కులు ఉన్నాయి. ఈక్రమంలోనే తెలంగాణలో తయారయ్యే చేనేత ఉత్పత్తులపైనా డిస్‌ప్లే చేసేందుకు ప్రత్యేకమైన హ్యాండ్లూమ్ మార్క్ లోగోను(Handloom Mark) తయారు చేశారు. చేనేత వస్త్రాన్ని నేస్తున్న కార్మికుడి బొమ్మతో దీన్ని రూపొందించారు. తెలంగాణలోని చేనేత సంఘాల పరిధిలోని అన్ని మగ్గాలను ఇప్పటికే జియోట్యాగ్‌తో లింక్ చేశారు. వాటన్నింటికీ త్వరలోనే ఆయా జిల్లాల సహాయ సంచాలకులు(ఏడీ)లు హ్యాండ్లూమ్ మార్క్ లేబుళ్లను సప్లై చేయనున్నారు. ఈ లేబుల్‌లో ఓ వైపు 9 అంకెల సంఖ్య ఉంటుంది. అందులో మొదటి రెండు అంకెలు ఆ జిల్లా/ఏడీ కోడ్‌ను, తర్వాత రెండంకెలు సంవత్సరాన్ని, మిగిలిన ఐదు అంకెలు రన్నింగ్ సీరియల్ నంబరును తెలియజేస్తాయి. లేబుల్‌కు మరోవైపు కార్మికుడు, ఉత్పత్తి వివరాలు ఉంటాయి.
Also Read :India vs England: ఇంగ్లండ్‌తో తలపడే టీమిండియా జట్టు ఇదే.. షమీకి ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ!
లోగోను ముద్రిస్తే.. ఏటా ఆర్థికసాయం
తెలంగాణ చేనేత ఉత్పత్తులపై ప్రత్యేక మార్క్ లేబుల్ ముద్రణను ఫిబ్రవరి నుంచి అమలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ వెల్లడించారు. తాము తయారుచేసే వస్త్రాలపై ఈ లోగోను వాడే చేనేత కార్మికులకు, ఆయా వస్త్రాల సైజుకు అనుగుణంగా ఏటా రూ.18 వేల దాకా ఆర్థికసాయాన్ని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ అందించనుంది. ప్రతినెలా పట్టులో 8 నుంచి 10 వార్ప్‌లతో 42 మీటర్ల పొడవు, కాటన్‌లో 15 నుంచి 18 వార్ప్‌లతో 42 మీటర్ల పొడవు, ఉన్నిలో 44 నుంచి 48 వార్ప్‌లతో 120 మీటర్ల పొడవున్న వస్త్రాన్ని తయారు చేసే చేనేత కార్మికులకు ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. తెలంగాణలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట పట్టుచీరలు చాలా ఫేమస్. సిద్దిపేటలో నేసే గొల్లభామ చీరలు, నల్గొండలో నేసే ఇక్కత్ చీరలు, వరంగల్‌లో నేసే కార్పెట్లు, కరీంనగర్‌లో నేసే దుప్పట్లు ఖ్యాతిని గడించాయి. వీటన్నింటికి ఇకపై హ్యాండ్లూమ్ మార్క్ ద్వారా బ్రాండ్ గుర్తింపు రానుంది.