Davos : జ్యూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పెట్టుబడిదారులతో జ్యూరిచ్‌లో సమావేశం కానునున్నారు. ఈ భేటి అనంతరం హయత్ హోటల్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
- By Latha Suma Published Date - 01:25 PM, Mon - 20 January 25

Davos : దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందం కాసేపటి క్రితమే జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులకు ఘన స్వాగతం పలికారు. ఇక, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పెట్టుబడిదారులతో జ్యూరిచ్‌లో సమావేశం కానునున్నారు. ఈ భేటి అనంతరం హయత్ హోటల్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం చంద్రబాబుల బృందం వెళ్తారు.
మరోవైపు దావోస్ పర్యటనలో గురుశిష్యుల కలయిక ఫోటో వైరల్ గా మారింది. తాజాగా సీఎం చంద్రబాబును, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. కాగా, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి తొలిసారిగా సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా నాలుగు రోజులపాటు పలువురిని చంద్రబాబు మీట్ అవ్వనున్నారు.
ఇక, దావోస్ పర్యటన తొలిరోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్‌లో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిట్టల్‌తో సమావేశమవుతారు. రెండోరోజు CII సెషన్‌లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు. ఆ తర్వాత సోలార్ ఇంపల్స్, కోకకోలా, వెల్ స్పన్, LG, కార్ల్స్ బర్గ్, సిస్కో, వాల్ మార్ట్ ఇంటర్ నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల ఛైర్మన్‌లు, CEOలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. యుఏఈ ఆర్ధికమంత్రి అబ్దుల్లా బిన్‌తో సీఎం భేటీ ఉంటుంది. ఆ తర్వాత ఎనర్జీ ట్రాన్సిషన్‌పై వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించే చర్చలో సీఎం పాల్గొంటారు.
కాగా, దావోస్ పర్యటన కోసం నిన్న సాయంత్రం సీఎం చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్‌లో సీఎంను కలుసుకున్న అధికారులు, ఆయన పర్యటన విజయవంతం కావాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన చంద్రబాబు, అందరి మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Hariramazogaiah : మరోసారి హరిరామజోగయ్య బహిరంగ లేఖ..!