Hariramazogaiah : మరోసారి హరిరామజోగయ్య బహిరంగ లేఖ..!
గతంలో చంద్రబాబు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని కోరారు. కాపు రిజర్వేషన్ అంశంలో కలిసి పని చేద్దామని పవన్ కల్యాణ్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు.
- By Latha Suma Published Date - 12:39 PM, Mon - 20 January 25

Hariramazogaiah : మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని జోగయ్య డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ కోసం తాను ఆమరణ దీక్ష చేస్తే చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకుందామని.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమింపజేశారని గుర్తు చేస్తూ.. జోగయ్య ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు విద్య, ఉద్యోగాలలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. కాపు EWS రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్లపై గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని రామజోగయ్య విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో రివైండ్ కౌంటర్ దాఖలు చేయాలని కోరారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 ఆగస్ట్ 3వ తేదీన ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని హరిరామ జోగయ్య గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి… కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలేదని విమర్శించారు. గతంలో చంద్రబాబు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని కోరారు. కాపు రిజర్వేషన్ అంశంలో కలిసి పని చేద్దామని పవన్ కల్యాణ్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు.
ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కాపు సంక్షేమ సేన హైకోర్టును కూడా ఆశ్రయించిందని తెలిపారు. తాము వేసిన పిటిషన్ పై వైసీపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని చెప్పారు. 5 శాతం రిజర్వేషన్ అమలు చేయలేమని స్పష్టం చేసిందని విమర్శించారు. డిసెంబర్ 4న హైకోర్టులో జరిగిన విచారణలో గత ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ నే సమర్థిస్తూ అడ్వొకేట్ జనరల్ తన వాదనలను వినిపించారని చెప్పారు. ఈ నెల 28న పిటిషన్ పై మరోసారి విచారణ జరగనుందని తెలిపారు. ఈలోగా కాపు రిజర్వేషన్ పట్ల స్టాండ్ ఏమిటో కూటమి ప్రభుత్వం తెలపాలని అన్నారు.
Read Also: Kolikapudi Srinivasrao: టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఏమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు..