Trump : ట్రంప్ విజయోత్సవ ర్యాలీ.. మూడో ప్రపంచ యుద్ధం, టిక్‌టాక్‌లపై కీలక వ్యాఖ్యలు
అమెరికాలో ఉద్యోగ కోతలను ఆపేందుకు, ప్రజల ఉద్యోగాలను కాపాడేందుకు.. టిక్ టాక్‌ను కాపాడుతానని ట్రంప్(Trump) ప్రకటించారు.
- By Pasha Published Date - 10:06 AM, Mon - 20 January 25

Trump : అమెరికా అంటేనే వలసదారులతో నిండిన దేశం. అక్కడ పెద్దసంఖ్యలో భారతీయులు, చైనీయులు ఉన్నారు. వాళ్లందరికీ షాకిచ్చే కీలక ప్రకటనను కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేశారు. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా భారీగా అక్రమ వలసదారులను స్వదేశాలకు తిప్పి పంపే కార్యక్రమాన్ని తాను మొదలుపెడతానని ఆయన తెలిపారు. ఈవిషయంలో రాజీపడేది లేదన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు వాషింగ్టన్ వేదికగా నిర్వహించిన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) విజయోత్సవ ర్యాలీలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Phone Tapping Case : అమెరికా నుంచి ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావులను రప్పించేందుకు కీలక యత్నం
టిక్‌టాక్‌ను అందుకే కాపాడుతా..
అమెరికాలో ఉద్యోగ కోతలను ఆపేందుకు, ప్రజల ఉద్యోగాలను కాపాడేందుకు.. టిక్ టాక్‌ను కాపాడుతానని ట్రంప్(Trump) ప్రకటించారు. అమెరికాలో జరిగే వ్యాపారాన్ని చైనాకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అమెరికాలోని టిక్ టాక్ వ్యాపారంలో 50 శాతం వాటాను అమెరికా కంపెనీకి ఇస్తే సరిపోతుందన్నారు. ఈరోజే దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేస్తానని ట్రంప్ వెల్లడించారు. దీనివల్ల అమెరికా కంపెనీకి టిక్ టాక్ వ్యాపారాన్ని విక్రయించేందుకు మరింత గడువు లభిస్తుందన్నారు. ‘‘ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతా. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లారుస్తా. మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఆపుతా’’ అని ఆయన తెలిపారు.
Also Read :Donald Trump Swearing In : కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. ప్రమాణ స్వీకారోత్సవం జరిగేది ఇలా
‘‘గత నాలుగేళ్లుగా అమెరికా ఇబ్బందులు పడింది. ఇక మేం దేశాన్ని పైకి తెస్తాం. ఎందుకంటే మేం గెలిచాం’’ అని ట్రంప్ ప్రకటించారు. దేశంలోని అవినీతిమయ వ్యవస్థను అంతం చేస్తామని ప్రతిన బూనారు. అమెరికా ఎన్నికల ఫలితాలు అనేవి ట్రంప్ ఎఫెక్ట్ కాదని, అది ప్రజల ఎఫెక్ట్ అన్నారు. అమెరికాపై విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంచేలా స్కూళ్లలో సంస్కరణలను అమలు చేయిస్తానని ఆయన పేర్కొన్నారు. తాము గెలిచామని తెలిసి.. సాఫ్ట్ బ్యాంక్, యాపిల్ లాంటి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యాయని ట్రంప్ చెప్పారు.