Gaza Strip : గాజాను మా ఆధీనంలోకి తీసుకుంటాం.. ట్రంప్ సంచలన ప్రకటన
గాజా(Gaza Strip) ప్రాంతాన్ని ఆర్థికంగా డెవలప్ చేస్తామని ట్రంప్ తెలిపారు.
- By Pasha Published Date - 11:47 AM, Wed - 5 February 25

Gaza Strip : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. పాలస్తీనాలోని గాజా ప్రాంతాన్ని తాము ఆధీనంలోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇక తమ ఆధీనంలోనే గాజా ఉంటుందన్నారు. గాజా నేలపై పేలకుండా మిగిలిపోయిన బాంబులు, ఇతరత్రా ఆయుధాలు అన్నింటినీ గుర్తించి నిర్వీర్యం చేసే బాధ్యతను తాము తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్ వేదికగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
Also Read :Cow Dung : ఆవుపేడను కొనేందుకు ఈ దేశాల క్యూ.. ఎంత ధర ?
గాజా ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం
గాజా(Gaza Strip) ప్రాంతాన్ని ఆర్థికంగా డెవలప్ చేస్తామని ట్రంప్ తెలిపారు. గాజాలో కూలిపోయిన భవనాల శిథిలాలను తొలగించి, మొత్తం ప్రాంతాన్ని శుభ్రం చేసే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. గాజా నుంచి హమాస్ మిలిటెంట్ సంస్థను పూర్తిగా తొలగించే అంశంపై తాను నెతన్యాహూతో లోతుగా చర్చించానని ట్రంప్ తెలిపారు. హమాస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేస్తేనే గాజాలో శాంతి స్థాపన సాధ్యం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘గత నాలుగేళ్లలో గాజా కోసం ఎవరూ ఏదీ చేయలేకపోయారు. చర్చల కోసం ప్రయత్నాలు చేశారే తప్ప.. గాజా ప్రజలను ఉద్ధరించే ప్రయత్నాలను చేయలేదు’’ అని ట్రంప్ కామెంట్ చేశారు.
Also Read :Celebrities Voting : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు వీరే
ఈజిప్టు, జోర్డాన్‌లకు వార్నింగ్
‘‘గాజా ప్రాంతం నుంచి పాలస్తీనా ప్రజలు వెళ్లి స్థిరపడేందుకు తప్పకుండా ఈజిప్టు, జోర్డాన్ దేశాలు అనుమతి ఇచ్చి తీరుతాయి. అందుకు అనుమతి ఇవ్వం అని ఆ రెండు దేశాలు చెబుతున్నాయి. ఆ రెండు దేశాలు అనుమతి ఇచ్చి తీరుతాయని నేను చెబుతున్నా’’ అని అమెరికా ప్రెసిడెంట్ తెలిపారు. స్వతంత్ర పాలస్తీనా దేశ ప్రతిపాదనను తప్పకుండా తిరిగి పరిశీలిస్తామన్నారు. ‘‘నేను అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగినప్పటి నుంచి పాలస్తీనాలో భారీగా మరణాలు సంభవించాయి. నేను ఇకపై అలా జరగనివ్వను. ఈ క్లిష్టమైన సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తాను’’ అని ట్రంప్ ప్రకటించారు.