US Treasury Hacked : ఏకంగా అమెరికా ట్రెజరీపై చైనా సైబర్ ఎటాక్ !
అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్(US Treasury Hacked) రాసిన లేఖలో ఈ విషయాన్ని తెలిపింది.
- By Pasha Published Date - 09:13 AM, Tue - 31 December 24

US Treasury Hacked : ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రభుత్వ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌పై సైబర్ ఎటాక్ జరిగింది. ఈ దాడి చైనా హ్యాకర్ల పనే అని అమెరికా ఆరోపించింది. అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్(US Treasury Hacked) రాసిన లేఖలో ఈ విషయాన్ని తెలిపింది. ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లోని వర్క్‌స్టేషన్లలో ఉండే కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు హ్యాకర్లు యత్నించారని పేర్కొంది. డిసెంబరు నెల ప్రారంభంలో ఈ సైబర్ దాడి జరిగిందని అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించింది. అమెరికా ట్రెజరీ విభాగానికి చెందిన వెబ్‌సైట్లకు సైబర్ సెక్యూరిటీని ‘బియాండ్ ట్రస్ట్’ అనే కంపెనీ అందిస్తోంది. ఈ కంపెనీ అమెరికాలోని జార్జియా రాష్ట్రం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘బియాండ్ ట్రస్ట్’ కంపెనీ నెట్‌వర్క్‌లోని లోపాలను వాడుకొని చైనా హ్యాకర్లు తమ వర్క్‌స్టేషన్లలో ఉండే కీలకమైన డాక్యుమెంట్లను తస్కరించారని అమెరికా ట్రెజరీ విభాగం ఆరోపించింది. డిసెంబర్ 8న ఈవిషయాన్ని బియాండ్ ట్రస్ట్ కంపెనీ గుర్తించి తమ దృష్టికి తీసుకొచ్చిందని తెలిపింది. ఆ వెంటనే తాము అమెరికా ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(CISA), ఎఫ్‌బీఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించింది.
Also Read :Pet Care : కుక్కలు , పిల్లులకు కూడా మధుమేహం ఉంటుంది, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చర్య తీసుకోండి
అమెరికా ట్రెజరీ విభాగం ఆరోపణలను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఖండించింది. తమపై అమెరికా చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. బియాండ్ ట్రస్ట్ కంపెనీ సైతం ఈ సైబర్ దాడిపై ఎలాంటి స్పందనను ప్రకటించలేదు. అయితే ఇటీవల కాలంలో తమ కస్టమర్ల భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదకర యాక్టివిటీని గుర్తించామని తెలిపింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది. ఇక ఈ అంశంపై అమెరికా దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఆ హ్యాకర్లు ఎక్కడివారు ? అనేది గుర్తించే దిశగా విచారణ చేస్తున్నారు.