Ukraine Attack : రష్యాలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ ఆర్మీ.. సుడ్జా గ్యాస్ కేంద్రం స్వాధీనం.. రంగంలోకి పుతిన్
అమెరికా, నాటో దేశాల నుంచి అందుతున్న సైనిక సహాయంతో ఉక్రెయిన్ ఆర్మీ తన ప్రతిఘటనను తీవ్రతరం చేసింది.
- By Pasha Published Date - 11:11 AM, Thu - 8 August 24

Ukraine Attack : అమెరికా, నాటో దేశాల నుంచి అందుతున్న సైనిక సహాయంతో ఉక్రెయిన్ ఆర్మీ తన ప్రతిఘటనను తీవ్రతరం చేసింది. తాజాగా ఉక్రెయిన్ దళాలు రష్యా భూభాగంలోకి చొరబడ్డాయి. ఈవివరాలను రష్యా ఆర్మీ కూడా ధ్రువీకరించింది. రష్యా బార్డర్‌లోని ఉక్రెయిన్ ఆర్మీ దాడుల్లో ఐదుగురు సామాన్య పౌరులు చనిపోయినట్లు సమాచారం. 31 మందికి గాయాలైనట్లు తెలిసింది. క్షతగాత్రుల్లో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. రష్యాలోకి తమ దళాలు ప్రవేశించిన అంశంపై ఉక్రెయిన్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక ఉక్రెయిన్ బలగాలు రష్యా భూభాగంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి.
We’re now on WhatsApp. Click to Join
ఉక్రెయిన్ ఆర్మీ(Ukraine Attack) ప్రతిఘటనను తీవ్రతరం చేసిన ప్రస్తుత తరుణంలో రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో ఎమర్జెన్సీని విధించారు. ఈవిషయాన్ని ఆ ప్రాంత గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ వెల్లడించారు. ఉక్రెయిన్ సైన్యాన్ని తరిమికొట్టే చర్యల్లో భాగంగానే ఎమర్జెన్సీ విధించామని ఆయన చెప్పారు.తాజా పరిస్థితులపై స్పందించిన పుతిన్.. ఉక్రెయిన్ చర్యలు తమ దేశ సైన్యాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రష్యా ప్రజలపైకి ఉక్రెయిన్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోందని ఆయన మండిపడ్డారు. దేశ సైనిక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పుతిన్ చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
Also Read :BSF Firing : బార్డర్‌లో బీఎస్ఎఫ్ కాల్పులు.. గుమిగూడిన బంగ్లాదేశీయులకు ఫైర్ వార్నింగ్
రష్యా ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం దాదాపు 1000 మంది ఉక్రెయిన్ సైనికులు సుడ్జా సిటీలోకి ప్రవేశించారు. వారితో పాటు 11 యుద్ధ ట్యాంకులు, 20 సాయుధ వాహనాలు ఉన్నాయి. సుడ్జా గ్యాస్ కేంద్రాన్ని ఉక్రెయిన్ బలగాలు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. యూరోపియన్ యూనియన్(ఈయూ)కు గ్యాస్‌ను సరఫరా చేసేందుకు రష్యాకు ఉన్న ఏకైక మార్గం ఇదే.ప్రస్తుతం రష్యా సైనికులతో వారంతా పోరాడుతున్నారు. ఆయా ఏరియాల్లోని ఇళ్ల నుంచి ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. రష్యా యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దిగాయి. పలు ప్రాంతాల నుంచి ప్రజలను ఇతర సురక్షిత ప్రదేశాలకు రష్యా ఆర్మీ తరలిస్తోంది.