BSF Firing : బార్డర్‌లో బీఎస్ఎఫ్ కాల్పులు.. గుమిగూడిన బంగ్లాదేశీయులకు ఫైర్ వార్నింగ్
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఆ దేశం నుంచి చాలామంది భారత్‌లోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు.
- By Pasha Published Date - 10:45 AM, Thu - 8 August 24

BSF Firing : బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఆ దేశం నుంచి చాలామంది భారత్‌లోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. వందలాది మంది బెంగాల్ రాష్ట్ర బార్డర్‌లోని పెట్రాపోల్-బెనాపోల్ సరిహద్దు క్రాసింగ్ వద్దకు చేరుకుంటున్నారు. ఎటువంటి వీసాలు లేకుండా అక్కడికి వస్తున్న వారిని భారత్‌కు చెందిన బీఎస్ఎఫ్ దళాలు(BSF Firing) అడ్డుకుంటున్నాయి. వెనక్కి తిప్పి పంపిస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి చాలామంది పెట్రాపోల్-బెనాపోల్ సరిహద్దు క్రాసింగ్ వద్ద గుమిగూడారు. కిషన్‌గంజ్-నార్త్ దినాజ్‌పూర్ సరిహద్దు చెక్ పాయింట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join
గురువారం తెల్లవారుజాము సమయానికి వారి సంఖ్య మరింతగా పెరిగిపోయింది. ఎంత చెప్పినా వారు చెక్ పాయింట్ వద్ద నుంచి వెళ్లడం లేదు. ఈక్రమంలో ఇవాళ బీఎస్ఎఫ్ బలగాలు కిషన్‌గంజ్-నార్త్ దినాజ్‌పూర్ సరిహద్దు ఏరియాలో కంచె లేని విభాగంలో ఒక రౌండ్ హెచ్చరిక కాల్పులు జరిపారు. అక్కడ గుమిగూడిన వారు తిరిగి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఈ ఫైరింగ్ చేశారు. భారత సరిహద్దుకు చేరుకున్న వారిలో చాలామంది షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలే ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా అధికారంలోకి రానున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు తమను వేధిస్తారనే భయంతో వారంతా భారత్‌కు వలస వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
‘‘బంగ్లాదేశ్‌లోని ఠాకూర్‌గావ్ జిల్లా నుంచి 200 మందికిపైగా ప్రజలు కిషన్‌గంజ్-నార్త్ దినాజ్‌పూర్ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. వారిలో ఎక్కువ మంది షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ సభ్యులే అని గుర్తించాం. వారిలో చాలామంది హిందువులు కూడా ఉన్నారు. కిషన్‌గంజ్-నార్త్ దినాజ్‌పూర్ సరిహద్దు వద్ద వారు గుమిగూడారు. వారిని వెనక్కి పంపడానికి ఒక రౌండ్ ఖాళీ కాల్పులు జరిపాం’’ అని బీఎస్ఎఫ్ డీఐజీ (నార్త్ బెంగాల్ ఫ్రాంటియర్) అమిత్ కుమార్ త్యాగి వెల్లడించారు. భారత్ – బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి 200 మీటర్ల నుంచి 500 మీటర్ల ఏరియాలో ఇప్పటికీ చాలామంది బంగ్లాదేశీయులు ఉన్నారని ఆయన తెలిపారు. మరోవైపు బుధవారం సాయంత్రం 600 మంది బంగ్లాదేశీయులు ఉత్తర బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి సమీపం నుంచి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించారు. అయితే వారిని బీఎస్ఎఫ్ బలగాలు అడ్డుకొని వెనక్కి పంపించాయి.