Two pilots killed: కూలిన సుఖోయ్.. ఇద్దరు పైలట్లు మృతి..!
సుఖోయ్-30 యుద్ధ విమానం నివాస భవనంపై కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది.
- By Gopichand Published Date - 10:00 PM, Sun - 23 October 22

సుఖోయ్-30 యుద్ధ విమానం నివాస భవనంపై కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. దక్షిణ సైబీరియాలోని ఇర్కుత్స్క్ నగరంలో రష్యాకు చెందిన ఫైటర్ జెట్ టెస్ట్ ఫ్లైట్ ఆదివారం రెండు అంతస్తుల భవనంపై కూలిపోవడంతో పైలట్లు మరణించారని ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. వారం వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. అక్టోబర్ 18న రష్యన్ మిలిటరీకి చెందిన Su-34 జెట్..యేస్క్ పట్టణంలోని నివాస భవనంపై కూలిపోయింది. ఆ ప్రమాదంలో పిల్లలతో సహా డజనుకు పైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే.
“Su వర్గం విమానం ఇర్కుట్స్క్‌లోని రెండు అంతస్తుల భవనాన్ని ఢీకొట్టింది” అని గవర్నర్ ఇగోర్ కోబ్జెవ్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అక్కడి అత్యవసర మంత్రిత్వ శాఖ విభాగం “టెస్ట్ ఫ్లైట్ సమయంలో Su-30 విమానం కూలిపోయింది” అని స్పష్టం చేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోయారని, స్థానికులు క్షేమంగా ఉన్నారని కోబ్జెవ్ తెలిపారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది చెలరేగిన మంటలను ఆర్పడానికి ప్రయత్నిచారని అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.