ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు
- Author : Vamsi Chowdary Korata
Date : 07-03-2026 - 4:28 IST
Published By : Hashtagu Telugu Desk
ఇరాన్ ప్రజలను ఉద్దేశించి అధ్యక్షుడు ఒక టీవీ ఛానల్లో మాట్లాడారు. గల్ఫ్ దేశాలపై ఇక ఎలాంటి దాడులు జరగబోవని పెజేష్కియాన్ కీలక ప్రకటన చేశారు. అయితే పొరుగు దేశాలు తమపై ప్రత్యక్ష దాడికి దిగితే మాత్రం స్పందించే హక్కు ఉందని స్పష్టం చేశారు.
“ఇరాన్ దాడికి గురైన పొరుగు దేశాలకు నా తరఫున, ఇరాన్ ప్రజల తరఫున క్షమాపణలు చెబుతున్నాను. గల్ఫ్ దేశాలపై ఇక దాడులు జరగవు. ఇరాన్‌పై ఆ దేశాలు దాడి చేయకపోతే తాము కూడా ఎలాంటి క్షిపణులు ప్రయోగించకూడదని తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయించింది” అని ఇరాన్ స్టేట్ టీవీలో ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పెజెష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పొరుగు దేశాలపై దాడులు చేయడం తమ ఉద్దేశం కానేకాదని అన్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం కాకూడదనే ఉద్దేశంతో గల్ఫ్ దేశాలపై దాడులు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇరాన్ లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కూడా పెజెష్కియాన్ స్పందించారు. టెహ్రాన్ లొంగిపోయే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇరాన్ లేదా ఇరాన్ ప్రజలు లొంగిపోవాలనే వారి కలలను వారు సమాధి చేసుకోవాలని వ్యాఖ్యానించారు.