US-Canada : ఇక అమెరికాతో పాత సంబంధం ముగిసింది: కెనడా
అమెరికాతో ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు మొత్తం ముగిసినట్లుగా పేర్కొన్నారు. వాహనాల దిగుమతులపై అమెరికా విధించిన 25 శాతం సుంకం వచ్చే వారం నుంచి అమల్లోకి రానుంది. వాహనాలపై అమెరికా సుంకాలు విధించడం అన్యాయం అని కార్నీ ధ్వజమెత్తారు. అమెరికా తీరు కారణంగా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు.
- By Latha Suma Published Date - 10:51 AM, Fri - 28 March 25

US-Canada : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటినుంచి సుంకాల పేరుతో పొరుగుదేశం కెనడాతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఆదేశ ఉత్పత్తులపై ఇప్పటికే భారీగా టారిఫ్‌లు విధించగా.. తాజాగా వాహన దిగుమతుల పైనా 25శాతం సుంకాన్ని ప్రకటించారు. దీనిపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయంతో అమెరికాతో పాత సంబంధం ముగిసిందన్నారు. అమెరికాతో ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు మొత్తం ముగిసినట్లుగా పేర్కొన్నారు. వాహనాల దిగుమతులపై అమెరికా విధించిన 25 శాతం సుంకం వచ్చే వారం నుంచి అమల్లోకి రానుంది. వాహనాలపై అమెరికా సుంకాలు విధించడం అన్యాయం అని కార్నీ ధ్వజమెత్తారు. అమెరికా తీరు కారణంగా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు.
Read Also: Surya Grahanam 2025 : రేపు సూర్యగ్రహణం
అమెరికా విధిస్తున్న ఈ సుంకాలను మేం ప్రతీకార వాణిజ్య చర్యలతోనే ఎదుర్కొంటాం. ఆ నిర్ణయాలు అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మా దేశాన్ని రక్షించుకోవడం కోసమే ఈ టారిఫ్‌లకు మేం ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాం అని కెనడా ప్రధాని వెల్లడించారు. ట్రంప్ సుంకాలు అన్యాయమైనవి. ఈ చర్యలతో ఇరుదేశాల మధ్య ఇప్పటివరకు ఉన్న స్నేహబంధాన్ని ట్రంప్ శాశ్వతంగా మార్చేస్తున్నారు. ఇది తమ కార్మికులపై ప్రత్యక్ష దాడి అని మార్క్ కార్నీఅభివర్ణించారు. అగ్రరాజ్యంపై త్వరలో ప్రతీకార సుంకాలను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.
కాగా, కెనడాపై అమెరికా అధిక స్థాయిలో సుంకాలను విధించింది. అంతేకాకుండా కెనడాను అమెరికాలో ఒక రాష్ట్రంగా చేస్తానంటూ ట్రంప్ ప్రకటించడంతో మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఏప్రిల్ 28న కెనడాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. బలమైన ప్రభుత్వంతో అమెరికాను ఎదుర్కొంటామని ఇటీవల మార్క్ కార్నీ పేర్కొన్నారు. మార్చి 14న జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. సాధారణంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మార్క్ కార్నీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ సంభాషణ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ట్రంప్-కార్నీ మాట్లాడుకోలేదు. అయితే ఇటీవల వైట్‌హౌస్ నుంచి కాల్ షెడ్యూల్ వచ్చిందని ట్రంప్‌తో మాట్లాడబోతున్నట్లు మార్క్ కార్నీ పేర్కొన్నారు.