Nawaz Sharif : పాక్ సైన్యం, జడ్జీలపై నిప్పులు చెరిగిన నవాజ్
Nawaz Sharif : ‘‘పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి కారణం ఇండియానో.. అమెరికానో.. ఆఫ్ఘనిస్తానో కాదు.. అది మనం చేతులారా చేసుకున్న పాపమే’’ అని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
- By Pasha Published Date - 08:17 AM, Wed - 20 December 23

Nawaz Sharif : ‘‘పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి కారణం ఇండియానో.. అమెరికానో.. ఆఫ్ఘనిస్తానో కాదు.. అది మనం చేతులారా చేసుకున్న పాపమే’’ అని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ సైన్యం పెత్తనాన్ని ఉద్దేశించి ఆయన సంచలన కామెంట్స్ చేశారు. పాక్ ఆర్మీ 1993, 1999, 2017లలో మూడుసార్లు తనను అక్రమ మార్గాల ద్వారా అధికార పీఠం నుంచి దింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ ఎంపీ టికెట్ ఆశావహులతో జరిగిన సమావేశంలో నవాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. “2018 ఎన్నికలలో పాక్ ఆర్మీ రిగ్గింగ్ చేసి తమకు అనుకూలంగా నిలిచే వాళ్లను అధికారంలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాతే పాక్ ఆర్థిక వ్యవస్థ పతనం మొదలైంది’’ అని చెప్పారు. సైనిక నియంతల పదవులను చట్టబద్ధం చేసినందుకు న్యాయమూర్తులను కూడా నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) తప్పుపట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘జడ్జీలు వాళ్లకు (సైనిక నియంతలు) పూలమాల వేస్తారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు వాళ్లను (సైనిక నియంతలు) కాపాడుతారు. ప్రధానమంత్రి స్థానంలో ఉన్నవాళ్లను మాత్రం న్యాయమూర్తులు తొలగిస్తారు. చివరకు పార్లమెంటును కూడా రద్దు చేస్తారు’’ అంటూ పాక్ న్యాయవ్యవస్థపై నవాజ్ ఆరోపణలు చేశారు. ‘‘2017లో నన్ను అధికార పీఠం నుంచి దింపేయడంలో ఐఎస్‌ఐ మాజీ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ హస్తం ఉంది. ఎట్టకేలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ఫైజ్ హమీద్ సహా పలువురిపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది’’ అని ఆయన చెప్పారు.