BBC Office: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు.. ‘సోదాలు కాదు.. సర్వేనే’
భారత ప్రధాని నరేంద్ర మోదీ (Modi) పై ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన
- Author : Maheswara Rao Nadella
Date : 14-02-2023 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
భారత ప్రధాని నరేంద్ర మోదీ (Modi) పై ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ (BBC Office) రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం రాజేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ క్రమంలో దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో (BBC Office) ఐటీ శాఖ అధికారులు ప్రత్యక్షమయ్యారు. ఇది కేవలం సర్వే అని.. సోదాలు కాదని ఐటీ అధికారులు వెల్లడించారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు సిస్టమ్స్ వాడొద్దని, ఇంట్లోనే ఉండాలని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.
పాత్రికేయుల ఫోన్లను,ల్యాప్‌టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. అవకతవకలకు సంబంధించి ఏవైనా ఆధారాలు గుర్తిస్తే.. ఈ సర్వేను కాస్తా సోదాలుగా మార్చే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 2002 గుజరాత్ అల్లర్లపై ‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. దానిని భారత్ తీవ్రంగా ఖండించింది. అదొక విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది. డాక్యుమెంటరీ వివాదంపై అమెరికా (US), బ్రిటన్ (Britain) దేశాలు దూరం పాటించాయి.
కాగా ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ‘తాము అదానీ గ్రూప్‌పై వెలువడిన నివేదిక గురించి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం బీబీసీ వెంటపడింది. ఒకరి పతనం దగ్గరపడినప్పుడు..ఆ వ్యక్తి తన ఆలోచనలకు విరుద్ధంగా వెళ్తారు’ అని కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేక సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: Raghurama Krishnan Raju: ఏపీ కొత్త గవర్నర్ ను కలిసిన రఘురామకృష్ణరాజు..!