Iran – Hezbollah : హిజ్బుల్లాకు మద్దతు.. లెబనాన్‌పై దాడి చేస్తే ఖబడ్దార్ : పెజెష్కియాన్
ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మసౌద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు.
- By Pasha Published Date - 08:36 AM, Tue - 9 July 24

Iran – Hezbollah : ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మసౌద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. పాలస్తీనాకు మద్దతుగా ప్రస్తుతం ఇజ్రాయెల్‌తో పోరాడుతున్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాకు తమ మద్దతు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణను ఇరాన్ వ్యతిరేకిస్తూనే ఉంటుందని పెజెష్కియాన్ తేల్చి చెప్పారు. ఈమేరకు పెజెష్కియాన్‌కు చెందిన ఓ సందేశాన్ని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA విడుదల చేసింది. దీని ప్రకారం.. ‘‘హిజ్బుల్లా, దాని అనుబంధ సమూహాలకు మేం అండగా ఉంటాం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క ప్రాథమిక విధాన నిర్ణయాలలో ఇది ఒకటి’’ అని పెజెష్కియాన్ తెలిపారు. ‘‘గత తొమ్మిది నెలలుగా పాలస్తీనాకు మద్దతుగా హిజ్బుల్లా పోరాడుతోంది. హమాస్ మిత్రుల తరఫున ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ నేరపూరిత విధానాలు ఆగే వరకు హిజ్బుల్లా దాడులు చేస్తూనే ఉంటుంది. దానికి మా మద్దతు ఉంటుంది’’ అని పెజెష్కియాన్(Iran – Hezbollah) పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇరాన్(Iran) విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నాసర్ కనాని మాట్లాడుతూ.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడికి దిగితే తాము చూస్తూ ఊరుకోబోమని తెలిపారు. తప్పకుండా ప్రతిచర్య ఉంటుందన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ.. ఇరాన్‌లో వచ్చిన ఎన్నికల ఫలితం అనేది అక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అనే దానికి ప్రతీక అని తెలిపారు. అంతకుముందు వరకు పాలించిన పాలకులపై ఇరానీయులకు ఉన్న వ్యతిరేక భావం ఓట్ల రూపంలో వ్యక్తమైందని చెప్పారు. ఇంతకుమునుపు ఇరాన్ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఇబ్రహీం రయీసీ హెలికాప్టర్ ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు.
Also Read :Dandruff: చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఈ పని చేయాల్సిందే!
అనంతరం నిర్వహించిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది పెజెష్కియాన్, ఇరాన్ మాజీ అణు సంధానకర్త సయీద్ జలీలీని ఓడించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పెజెష్కియాన్‌ను హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా అభినందించారు. ఇజ్రాయెల్, అమెరికాలను వ్యతిరేకించే పశ్చిమాసియాలోని మిలిటెంట్ సంస్థలకు బలమైన మద్దతుదారుగా ఇరాన్‌ను అభివర్ణించారు. 1982లో లెబనాన్ అంతర్యుద్ధం జరిగింది. ఆనాటి నుంచి లెబనాన్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న హిజ్బుల్లా(Hezbollah) మిలిటెంట్ సంస్థకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోంది.