జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.
- Author : Latha Suma
Date : 10-01-2026 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
. పరస్పర చర్చలతోనే సమస్యల పరిష్కారం
. వివాదాలు కాదు… పరిష్కారాలే లక్ష్యం
. కృష్ణా ప్రాజెక్టులు, సహకారం అవసరం
Water disputes : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది వివాదాల కోసం కాదని, శాంతియుత సహకారం కోసం అని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా నీటి సమస్యను చూడాల్సిన అవసరం ఉందని, ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు.
జల వివాదాల ద్వారా రాజకీయ లాభాలు పొందాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “పంచాయితీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లు కావాలని చెబుతాను. అలాగే వివాదాలు కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలనే నా సమాధానం” అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. కోర్టుల జోక్యం వల్ల సమస్యలు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయని, మన మధ్యే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలే ప్రభుత్వాల నుంచి రావాలని, రాజకీయ అజెండాల కోసం నీటి సమస్యను వాడుకోవద్దని సూచించారు.
ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కృష్ణా నదిపై చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. అడ్డంకుల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయని, దాని ప్రభావం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వివాదాలు వద్దని, పరిష్కారాలే కావాలని మరోసారి స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు.
అదే విధంగా తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ కావాలంటే పొరుగు రాష్ట్రాల సహకారం తప్పనిసరి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. జల వివాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకు వేస్తే, తెలంగాణ పది అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. చివరగా ఆయన మాట్లాడుతూ, పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన రాష్ట్రంగా ఎదుగుతోందని, ప్రపంచ స్థాయి కంపెనీలకు భారతీయులే సీఈవోలుగా ఉన్నారని పేర్కొన్నారు.