జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్!
తాజా కథనాల ప్రకారం, రిలయన్స్ జియో తొలి పబ్లిక్ ఇష్యూ (IPO)లో సుమారు 2.5 శాతం వాటాను విక్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
- Author : Latha Suma
Date : 10-01-2026 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
. ఐపీఓ ద్వారా వాటా విక్రయం ..లక్ష్యం రూ.36 వేల కోట్లు
. జియో విలువ అంచనాలు..180 నుంచి 240 బిలియన్ డాలర్లు
. టెలికాం నుంచి ఏఐ వరకు..ఐపీఓ ఆలస్యానికి కారణాలివే
Jio IPO: భారత స్టాక్ మార్కెట్‌లో మదుపర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఓల్లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎదిగిన జియో, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కార్పొరేట్ దిగ్గజం నుంచి రావడం వల్ల ఈ ఐపీఓపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుమారు 50 కోట్లకు పైగా ఉండటం, డిజిటల్ సేవల్లో వేగంగా విస్తరించడం జియోకు ప్రధాన బలంగా మారాయి. ఈ ఏడాదిలోనే జియో ఐపీఓ వచ్చే అవకాశాలపై తాజాగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజా కథనాల ప్రకారం, రిలయన్స్ జియో తొలి పబ్లిక్ ఇష్యూ (IPO)లో సుమారు 2.5 శాతం వాటాను విక్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వాటా విక్రయం ద్వారా మార్కెట్ నుంచి సుమారు 4 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.36 వేల కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం వాస్తవమైతే, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించనుంది. ఇప్పటివరకు నమోదైన అన్ని ఐపీఓలను దాటేసే స్థాయిలో ఇది ఉండనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ జియో మార్కెట్ విలువపై వివిధ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు భారీ అంచనాలు వేస్తున్నాయి. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జెఫ్రీస్ జియో విలువను సుమారు 180 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది.
ఈ లెక్కన 2.5 శాతం వాటా విక్రయిస్తే దాదాపు 4.5 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, మరికొన్ని బ్యాంకులు జియో మార్కెట్ విలువను 200 నుంచి 240 బిలియన్ డాలర్ల మధ్యగా అంచనా వేస్తున్నాయి. అయితే ఈ వాటా విక్రయాన్ని ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో చేపడతారా, లేక కొత్త షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరిస్తారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 2019లోనే వచ్చే ఐదేళ్లలో రిలయన్స్ జియోను స్టాక్ మార్కెట్‌లోకి తీసుకొస్తామని ముకేశ్ అంబానీ ప్రకటించారు.
అయితే ఆ తర్వాత జియో వ్యాపారం టెలికాం సేవలకే పరిమితం కాకుండా, డిజిటల్ ప్లాట్‌ఫార్ములు, క్లౌడ్ సేవలు, తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలోకి కూడా విస్తరించింది. ఈ విస్తరణల వల్ల కంపెనీ మార్కెట్ విలువ మరింత పెరిగింది. ఐపీఓ కొంత ఆలస్యం కావడానికి ఇదే ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, గత కొన్ని సంవత్సరాల్లో అంతర్జాతీయ కంపెనీలు సహా అనేక పెద్ద ఇన్వెస్టర్లు జియోలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఐపీఓ సమయంలో తమ వాటాలను విక్రయించి లాభాలు పొందాలని ఆయా ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జియో ఐపీఓ భారత క్యాపిటల్ మార్కెట్‌కు ఒక మైలురాయిగా మారనుందని నిపుణులు అంటున్నారు.