ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
ఈ దాడుల్లో అత్యాధునిక “ఒరెష్నిక్” బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తించింది.
- Author : Latha Suma
Date : 10-01-2026 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
. పుతిన్ నివాసంపై దాడికి ప్రతీకారం
. లివివ్‌పై రష్యా ఘాటు దాడులు
. దీన్ని అడ్డుకునే ఆయుధాలు లేవని ప్రకటించిన రష్యా
Russia Ukraine war: రష్యా–ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్త దశకు చేరుకుంది. గత రాత్రి ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలోని కీలక నగరం లివివ్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో అత్యాధునిక “ఒరెష్నిక్” బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తించింది. ఈ యుద్ధంలో ఈ క్షిపణిని ప్రయోగించడం ఇది రెండోసారి అని రష్యా వర్గాలు వెల్లడించాయి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసేందుకు చేసిన ప్రయత్నానికి ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపింది.
పశ్చిమ ఉక్రెయిన్ సాధారణంగా యుద్ధ ప్రభావం తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో, లివివ్‌పై దాడి తీవ్రత మరింత చర్చనీయాంశంగా మారింది. ఒరెష్నిక్ క్షిపణి రష్యా ఆయుధ సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందని విశ్లేషకులు అంటున్నారు. ఇది ధ్వని వేగానికి పదిరెట్లు ఎక్కువగా, గంటకు సుమారు 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఈ క్షిపణి అణు వార్‌హెడ్‌లు లేదా సాధారణ వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. యూరప్‌లోని అనేక దేశాలు దీని పరిధిలోకి వస్తాయని, ప్రస్తుతానికి దీన్ని అడ్డుకునే రక్షణ వ్యవస్థలు లేవని రష్యా ప్రకటించింది. ఈ వ్యాఖ్యలు నాటో దేశాల్లో భద్రతా ఆందోళనలను మరింత పెంచాయి.
ఆధునిక సాంకేతికతతో రూపొందిన ఈ క్షిపణి యుద్ధ సమతుల్యతను మార్చే శక్తి కలిగి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం దాడిలో రష్యా 36 క్షిపణులు ప్రయోగించగా, వాటిలో ఒరెష్నిక్ ఒకటి. అదనంగా 242 డ్రోన్లను కూడా ఉక్రెయిన్‌పైకి పంపింది. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ అప్రమత్తంగా వ్యవహరించి అనేక డ్రోన్లను, కొన్ని క్షిపణులను అడ్డుకున్నప్పటికీ, దాడి ప్రభావం తీవ్రంగానే ఉంది. ఈ ఘటనలో నలుగురు పౌరులు మరణించగా, ఒక పారామెడిక్‌తో పాటు రెస్క్యూ సిబ్బందిని కలుపుకొని మొత్తం 22 మంది గాయపడ్డారు. నివాస భవనాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
నాటో సరిహద్దుకు సమీపంలో ఒరెష్నిక్ క్షిపణి పడినట్లు సమాచారం రావడంతో, ఇది యూరప్ భద్రతకు పెద్ద ముప్పుగా మారుతుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. యుద్ధం ఇక ఉక్రెయిన్ పరిమితిని దాటి అంతర్జాతీయ స్థాయిలో అస్థిరతను సృష్టించే ప్రమాదం ఉందన్న భయాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దౌత్య ప్రయత్నాలు వేగవంతం చేయకపోతే, యుద్ధం మరింత ప్రమాదకర దిశలో సాగుతుందన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.