Indian Student : అమెరికాలో భారత విద్యార్థి అరెస్ట్.. హమాస్‌తో లింకులు ?
జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేసినందు వల్లే బదర్‌ను(Indian Student) అరెస్టు చేశామని అమెరికా పోలీసు శాఖలోని అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ అంటున్నారు.
- By Pasha Published Date - 10:54 AM, Thu - 20 March 25

Indian Student : భారత విద్యార్థి బదర్ ఖాన్ సూరిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. వాషింగ్టన్ డీసీలో ఉన్న జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడిగా బదర్ ఖాన్ సూరి ఉన్నారు. స్టూడెంట్ వీసాపై భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన బదర్.. పాలస్తీనా సంతతికి చెందిన అమెరికా పౌరురాలిని పెళ్లి చేసుకున్నారు. అమెరికా పోలీసులు సోమవారం రోజు వర్జీనియాలో బదర్‌ను అరెస్టు చేశారు. తనకు నేర చరిత్ర లేదని, తన భార్యకు పాలస్తీనా మూలాలు ఉన్నందు వల్లే అరెస్టు చేశారని బదర్ ఖాన్ సూరి వాదిస్తున్నారు. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన ఇమిగ్రేషన్ కోర్టులో పిటిషన్ వేశారు.
పోలీసుల వాదన ఇదీ..
జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేసినందు వల్లే బదర్‌ను(Indian Student) అరెస్టు చేశామని అమెరికా పోలీసు శాఖలోని అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ అంటున్నారు. హమాస్‌లోని పలువురితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కారణంతోనే బదర్ వీసాను కూడా రద్దు చేశామన్నారు.
Also Read :UPI Update : మీరు షాపింగ్‌లో వినియోగించే.. యూపీఐ ఫీచర్‌కు గుడ్‌బై !
యూనివర్సిటీ స్పందన..
బదర్ అరెస్టుపై జార్జ్‌టౌన్ యూనివర్సిటీ స్పందిస్తూ.. ‘‘బదర్‌ను ఎందుకు అరెస్టు చేశారు అనేది మాకు తెలియదు. ఆయన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మాకు సమాచారం లేదు. ఈ కేసు విచారణకు మేం పూర్తిగా సహకరిస్తున్నాం. కోర్టు న్యాయబద్ధమైన తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read :Guntur Air Taxi : మేడిన్ గుంటూరు ‘ఎయిర్ ట్యాక్సీ’.. యువతేజం చావా అభిరాం కసరత్తు
పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు
అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై అమెరికా సర్కారు కొరడా ఝుళిపిస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనాకు మద్దతుగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. అప్పట్లో 2వేల మందికిపైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఇటీవలే కొలంబియా యూనివర్సిటీలోనూ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి. వీటికి మద్దతు తెలిపిన భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను రద్దు చేశారు. ఆమె స్వీయ బహిష్కరణకు గురైనట్లు అధికారులు ప్రకటించారు.