India Support Israel: ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చిన భారత్.. నేడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం..!
ఇరాన్ హమాస్‌కు మద్దతివ్వగా, భారత్, అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు (India Support Israel) పలికాయి.
- Author : Gopichand
Date : 08-10-2023 - 6:49 IST
Published By : Hashtagu Telugu Desk
India Support Israel: గాజా స్ట్రిప్ నుండి పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ హమాస్ శనివారం (7 అక్టోబర్) తెల్లవారుజామున దక్షిణ ఇజ్రాయెల్‌పై అకస్మాత్తుగా దాడి చేసింది. హమాస్ దాదాపు 5,000 రాకెట్లను ప్రయోగించింది. హమాస్ ముష్కరులు కూడా ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డారు. దీని తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. హమాస్‌కు వ్యతిరేకంగా IDF ‘స్వార్డ్స్ ఆఫ్ ఐరన్’ ప్రచారాన్ని ప్రారంభించింది. పరిస్థితి యుద్ధంలా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా “మేము యుద్ధంలో ఉన్నాము” అని అన్నారు.
ఇరువర్గాల దాడుల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు
ఈ దాడిలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారని, 900 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంల ఇజ్రాయెల్ దాడిలో కనీసం 160 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని, వెయ్యి మందికి పైగా గాయపడ్డారని గాజాలోని వైద్య వర్గాలు తెలిపాయి. హమాస్ కూడా డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ సైనికులను పట్టుకున్నట్లు పేర్కొంది. అదే సమయంలో హమాస్ తీవ్రవాదులు.. ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను గాజాలో బందీలుగా పట్టుకున్నారని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి కూడా ధృవీకరించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఘటన యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇరాన్ హమాస్‌కు మద్దతివ్వగా, భారత్, అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు (India Support Israel) పలికాయి. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ కూడా తన మద్దతుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అతని మద్దతుతో ఇజ్రాయెల్ బలోపేతం అవుతుందని అన్నారు.
వార్తా సంస్థ PTI ప్రకారం.. పాలస్తీనా సమస్య, మధ్యప్రాచ్యంలోని పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం (అక్టోబర్ 8) క్లోజ్డ్ డోర్ సమావేశాన్ని నిర్వహించనుంది. అదే సమయంలో హమాస్ దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ఖండించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇందులో వందలాది మంది అమాయక పౌరులు మరణించారు. గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతి. ఇకపై హింసను నివారించాలని, తక్షణమే శాంతి మార్గాన్ని వెతకాలని నేను అన్ని పార్టీలను కోరుతున్నాను అని ఆయన అన్నారు.