Imran Khan first Reaction: దాడి తర్వాత ఇమ్రాన్ ఖాన్ మొదటి రియాక్షన్ ఇదే..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సభలో కాల్పులు కలకలం రేపాయి.
- By Gopichand Published Date - 10:48 PM, Thu - 3 November 22

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సభలో కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో సభ జరుగుతుండగా ఆయన కంటైనర్‌కు సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన మేనేజర్ రషీద్, సింధ్ మాజీ గవర్నర్ ఇమ్రాన్ ఇష్మాయిల్‌కు గాయాలు అయ్యాయి. ఇమ్రాన్ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.
ఇమ్రాన్‌ఖాన్‌పై దాడిపై భారత్ స్పందించింది. పరిస్థితిని గమనిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. ఈ సంఘటన ఇప్పుడే జరిగింది. మేము నిశితంగా గమనిస్తున్నాము. జరుగుతున్న పరిణామాలను మేము గమనిస్తాము. కాగా.. దాడి తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రకటన కూడా తెరపైకి వచ్చింది. “అల్లా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. నేను నా శక్తితో మళ్ళీ పోరాడతాను” అని చెప్పాడు.
ఇమ్రాన్ ఖాన్‌పై జరిగిన కాల్పుల ఘటనను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఇలాంటి చర్యలు సరికాదని అభిప్రాయపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ దేశంలో రాజకీయ హింసకు చోటు లేదని పేర్కొన్నారు. దీనిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయితే.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేయాలనుకున్నానని ఈ కేసులో నిందితుడు మహమ్మద్ నవీద్ పోలీసులకు తెలిపాడు. ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే చంపాలనుకున్నానని చెప్పాడు. తాను ఈ నేరాన్ని తనంతట తానే చేశానని, తన వెనుక ఎవరూ లేరని, దీనిలో ఇతరుల ప్రమేయం లేదని చెప్పాడు. ఈ వివరాలను పాకిస్థాన్ మీడియా గురువారం వెల్లడించింది.