రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!
ఓమా ప్రాంతానికి చెందిన ట్యూనా చేపల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నూతన సంవత్సర వేలంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
- Author : Gopichand
Date : 06-01-2026 - 3:18 IST
Published By : Hashtagu Telugu Desk
Bluefin Tuna: ఒక చేప ధర ఎంత ఉండవచ్చు? కొన్ని వేల రూపాయలు లేదా మహా అయితే కొన్ని లక్షలు.. కానీ ఈ ట్యూనా చేప ధర అక్షరాలా 3.2 మిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో 29 కోట్ల రూపాయలకు పైమాటే! భారతదేశంలో 29 కోట్ల రూపాయలతో నేడు మీరు దాదాపు 208 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని కొనవచ్చు లేదా ఎన్నో విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను సొంతం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా
టోక్యోలోని తోయోసు ఫిష్ మార్కెట్‌లో ట్యూనా వేలం జరిగింది. 2026 సంవత్సరపు మొదటి వేలంలో 243 కిలోల (535 పౌండ్లు) బరువున్న ఒక భారీ పసిఫిక్ బ్లూఫిన్ ట్యూనా ఏకంగా 510 మిలియన్ యెన్లకు (3.2 మిలియన్ డాలర్లు) అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది.
Also Read: నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్‌లో 14 మంది క్రికెటర్లు!
ఈ చేపను ఎవరు కొన్నారు?
ప్రసిద్ధ ‘సుషీ జాన్మాయ్’ (Sushi Zanmai) రెస్టారెంట్ చైన్‌ను నడుపుతున్న కియోమురా కార్పొరేషన్ ఈ భారీ వేలంలో పసిఫిక్ బ్లూఫిన్ ట్యూనాను దక్కించుకుంది. దీని యజమాని పేరు కియోషి కిమురా. కిమురా పేరు మీద ఇప్పటికే ఒక రికార్డు ఉంది. 2019లో ఆయన 334 మిలియన్ యెన్లకు (2.1 మిలియన్ డాలర్లు) ఒక ట్యూనాను కొనుగోలు చేశారు. ఈ ఏడాది వేలంతో కిమురా తన పాత రికార్డును తానే బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు.
కిమురా విలేకరులతో మాట్లాడుతూ.. నేను కొంచెం తక్కువ ధరకే లభిస్తుందని ఆశించాను. కానీ చూస్తుండగానే ధర పెరిగిపోయింది. ఇది కొంతవరకు అదృష్టం కోసం చేసిన పని. కానీ ఒక మంచి ట్యూనా చేపను చూసినప్పుడు నేను నన్ను నేను నియంత్రించుకోలేను. దీన్ని ఇంకా రుచి చూడలేదు. కానీ ఇది ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అని అన్నారు.
ఈ ట్యూనా చేపకు అంత ధర ఎందుకు?
ఓమా (Oma) ప్రాంతానికి చెందిన ట్యూనా చేపల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నూతన సంవత్సర వేలంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. తోయోసు మార్కెట్‌లో రోజూ వందల కొద్దీ ట్యూనా చేపలు అమ్ముడవుతాయి. కానీ ఓమా బ్లూఫిన్ ట్యూనా తన నాణ్యత కారణంగా అత్యధిక ధర పలుకుతుంది. అందుకే దీనిని ‘బ్లాక్ డైమండ్ ఆఫ్ ది సీ’ అని పిలుస్తారు. ఈ చేపలో ఉండే అధిక కొవ్వు శాతం, అద్భుతమైన రుచి, నోట్లో వేసుకోగానే కరిగిపోయే మెత్తని స్వభావం దీనికి ఇంతటి క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.