CM Chandrababu : రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ .. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీ తీసుకురావాలి : సీఎం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ రూపొందించాలి. రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అధికారులను ఆదేశించారు.
- By Latha Suma Published Date - 04:46 PM, Tue - 17 June 25

CM Chandrababu : రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అమరావతిలోని సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ రూపొందించాలి. రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అధికారులను ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీ అమలు మొదటి దశగా రాష్ట్రంలోని మూడు ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లో ఒక ఏడాది వ్యవధిలోగా ప్రత్యేక పార్కుల ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వీటితో పాటు ఆధునిక సాంకేతికతను వాడుతూ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని తెలిపారు.
Read Also: Kavitha : బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి.. జూలై 17న రైల్ రోకో : ఎమ్మెల్సీ కవిత
పర్యావరణ పరిరక్షణలో కీలకమైన మరో అంశంగా, ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీకి ముందు రాష్ట్రంలోని 21 నగరాల్లో వాటిలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం వంటి ప్రధాన కార్పొరేషన్లు కలిపి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టాలని సీఎం స్పష్టంగా తెలిపారు. పర్యావరణం శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. చెత్తపై తక్షణమే సమర్థవంతమైన నియంత్రణ ఉండాలి అని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 87 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 157 రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ కేంద్రాలు ఏర్పాటుకు దిశానిర్దేశం చేశారు. వ్యతిరేక పరిస్థితుల్లోనూ శ్రమించి వ్యర్థాల నిర్వహణలో నూతన ఆవిష్కరణలకు దోహదపడే సంస్థలకు, వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛత అవార్డులు’ అందించనుంది అని తెలిపారు.
మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సీఎం సమావేశమై రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుపై వారి ప్రతిపాదనలను పరిశీలించారు. త్వరితగతిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, వచ్చే 90 రోజుల్లో రీసైక్లింగ్, వేరు వేరు చెత్త వర్గీకరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని వ్యర్థాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.