CM Yogi Adityanath : ఉగ్రవాదం అనేది కుక్కతోక లాంటిది: సీఎం యోగి ఆదిత్యనాథ్
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. "ఆపరేషన్ సిందూర్" సమయంలో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని తెలిపారు. ఈ క్షిపణుల సామర్థ్యం ప్రపంచం మొత్తానికి తెలిసిందని పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 02:33 PM, Sun - 11 May 25

CM Yogi Adityanath : భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా లఖ్‌నవూలో నిర్మించిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణుల ఉత్పత్తి యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. “ఆపరేషన్ సిందూర్” సమయంలో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని తెలిపారు. ఈ క్షిపణుల సామర్థ్యం ప్రపంచం మొత్తానికి తెలిసిందని పేర్కొన్నారు. “బ్రహ్మోస్ ప్రభావం గురించి తెలియని వారు పాకిస్థాన్‌ను అడిగి తెలుసుకోవచ్చు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Read Also: Pakistan : పుల్వామా ఉగ్రదాడిలో మా హస్తం ఉంది: పాక్ వాయుసేనాధికారి అంగీకారం
ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని, రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్‌లో ప్రతి ఏడాది 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తారని అధికారులు తెలిపారు. అదనంగా, 100 నుంచి 150 నెక్ట్స్ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణులను కూడా ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఒక్క సుఖోయ్ యుద్ధవిమానం ఒక్క క్షిపణిని మోసుకెళ్లగలిగిన నేపథ్యంలో, నూతన క్షిపణులతో మూడు వరకు మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్నదని చెప్పారు. ఈ క్షిపణులు 290 నుంచి 400 కి.మీ పరిధిలో, మాక్ 2.8 వేగంతో ప్రయాణించగలవు. ప్రస్తుత బ్రహ్మోస్ బరువు 2,900 కిలోగ్రాములు కాగా, నూతన క్షిపణుల బరువు 1,290 కిలోలుగా ఉంటుందని వివరించారు. బ్రహ్మోస్ క్షిపణులు భూమి, గాలి, సముద్ర మార్గాల్లో ప్రయోగించగలవని, ఇవి భారత రక్షణ వ్యవస్థలో కీలకంగా నిలుస్తున్నాయని చెప్పారు.
ప్రధానమంత్రి మోడీ 2018లో ప్రారంభించిన డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ఈ యూనిట్‌ను అభివృద్ధి చేశారు. అలాగే బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీ, టైటానియం మరియు సూపర్ అలాయ్స్ తయారీ ప్లాంట్‌లను కూడా ప్రారంభించారు. ఇవి అంతరిక్ష కార్యక్రమాలు, ఫైటర్ జెట్ల తయారీలో కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. డిఫెన్స్ టెస్టింగ్ మరియు ఇంటిగ్రేషన్ సిస్టమ్స్‌కు కూడా కేంద్ర మంత్రి పునాది వేసినట్లు సమాచారం. 2019లో తమిళనాడులో మొదటి డిఫెన్స్ కారిడార్ ప్రారంభించగా, ఇది దేశీయ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు, దిగుమతులను తగ్గించేందుకు మరియు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఉద్దేశించబడిన ప్రాజెక్టు అని తెలిపారు.